Saturday, November 23, 2024
HomeTrending NewsNIMS: త్వరలో నిమ్స్ ఆస్పత్రికి నూతన భవనం

NIMS: త్వరలో నిమ్స్ ఆస్పత్రికి నూతన భవనం

ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2000 పడకల నూతన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేసుకోబోతున్నామని, త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించే విధంగా ఉండే ఈ నూతన నిర్మాణానికి అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేసుకొని, నిర్మాణం మొదలు పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో తొలి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎనిమిది అంతస్తుల్లో నిర్మించే నూతన నిమ్స్ నిర్మాణం అందుబాటులోకి వస్తే, 1500 గా ఉన్న పడకల సంఖ్య మొత్తం 3500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తయితే తద్వారా మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఒక్క నిమ్స్ లోనే మొత్తం 3700 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా నిమ్స్ సేవలు మరింత విస్తృతం అవుతాయని చెప్పారు. నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలన్నారు. దీంతో పాటు గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ తెలంగాణలో నెలకొని ఉన్నట్లు అవుతుందన్నారు.

ఫెర్టీలిటీ సేవలు ప్రజలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ పనులు వేగవంతం చేయాలన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా, గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను మంత్రి ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి పీహెచ్సీ, బస్తీ దవాఖాన, సీ హెచ్ సీల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నూతనంగా ప్రారంభించిన ఎం ఎన్ జే ఆసుపత్రి ఆంకాలజీ బ్లాక్ లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాలన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలన్నారు. కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నారు.

స్టాఫ్ నర్స్ పరీక్ష ఆన్లైన్ ద్వారా..
వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో భర్తీ చేసే 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్ లైన్ విధానం (CBT) లో నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి అదేశాలు జారీ చేశారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు 40,936 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్ష కోసం హైదరాబాద్ తో పాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో సెంట్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల తుది ఫలితాలు విడుదల కంటే ముందే,అసిస్టెంట్ ప్రొఫెసర్ల ట్రాన్ఫర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్ఛి, డీఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ ఇంచార్జీ డైరెక్టర్ బీరప్ప, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ జయలత, ఇత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్