భారతదేశంలో సరస్సులు, చెరువులు, కుంటలు వంటి జలాశయాలు 24 లక్షల 24 వేల వరకూ ఉన్నాయని దేశంలో తొలిసారి జరిపిన సర్వేలో తేలింది. ఇలాంటి జలాశయాలు పశ్చిమ బెంగాల్ లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ తూర్పు రాష్ట్రంలో 7 లక్షల 47 వేలు ఉన్నాయి. మానవులకు అత్యంత అవసరమైన నీటిని అందించే ఈ సరస్సులు, చెరువులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని దేశంలో మొదటిసారి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిపిన గణాంక వివరాల సేకరణలో తేలింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో చేపట్టిన నీటిపారుదల సెన్సస్ కార్యక్రమం కింద 6వ చిన్న తరహా నీటిపారుదల సెన్సస్–2017–18 తో పాటు దేశవ్యాప్తంగా జలాశయాల (వాటర్ బాడీస్) లెక్కలు సేకరించారు. కేంద్ర జలశక్తి శాఖ కిందటి నెలాఖరులో ఈ సెన్సస్ వివరాలు విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం మొత్తం జలాశాయాల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ అత్యధిక నీటి కుంటలు, రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రంగా తన పేరు నమోదు చేసుకుంది. దేశంలో అత్యధిక చెరువులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని, తమిళనాడులో అత్యధిక సరస్సులు ఉన్నాయని ఈ సర్వే నివేదిక చెబుతోంది. అలాగే, జలసంరక్షణ పథకాలలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది.
భూగర్భ జలాల రీఛార్జ్ (వ్యాప్తి, విస్తరణ, లభ్యత) విషయంలో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కూడా ఈ సర్వే చెబుతోంది. 1,60,205 కిలోమీటర్ల విస్తీర్ణం, ఐదు కోట్ల పాతిక లక్షలకు పైగా జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నీటి లభ్యతకు కొదవు లేదు. ఆంధ్రప్రదేశ్ 1,90,777 సరస్సులు, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లతో దేశంలోనే ఈ జలవనరుల విషయంలో మూడో స్థానంలో ఉందని పై సర్వే తెలిపింది. ఈ సరస్సులు, కుంటలు, చెరువులు ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లోనే 99.7 శాతం (1,90,263) ఉండగా, పట్టణ ప్రాంతాల్లో కేవలం 0.3 శాతం (514) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మరో ఆసక్తికరణ విషయం ఏమంటే–పైన చెప్పిన నీటి నిల్వ వ్యవస్థల్లో అత్యధికం చెరువులు. వాటి తర్వాత అధిక సంఖ్యలో ఉన్నవి–నీటి సంరక్షణ పథకాల ద్వారా ఏర్పాటు చేసిన నీటి వనరులు, పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యాములు. రాష్ట్రంలోని 1,90,777 చెరువులు, సరస్సులు, కుంటలు ఇతర నీటి నిల్వ వ్యవస్థల్లో 78.2 శాతం మాత్రమే ప్రజా వినియోగంలో ఉన్నాయి. మిగిలిన 21.8 శాతం నీటి నిల్వ వ్యవస్థలు ఉపయోగంలో లేకపోవడానికి కారణం వాటిలో నీరు లేకపోవడం లేదా మరమ్మతులు చేయడానికి వీలులేని స్థితి ఉండడం, ఇంకా ఇతర సమస్యలు. సముద్రతీర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో అనేక జీవనదులు, వాగులు, వంకలు, తగినంత వర్షపాతం ఉండడం వల్ల నీటి నిల్వ వ్యవస్థలు దాదాపు 80 శాతం వరకూ ప్రజల అవసరాలు తీరుస్తున్నాయి.