తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడు, ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేరికలపై దృష్టి సారించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ఎన్నికల పైనే ఫోకస్ పెడతామని బీజేపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. అప్పటి వరకు పార్టీలో కొత్త, పాత నేతలు కలిసి పనిచేయాలని.. పార్టీలో చేరికలను ముమ్మరం చేయాలని నేతలకు సూచించింది. దీనికి అనుగుణంగా బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ప్రయత్నాలు ప్రారంభించారు.
బీఆరెస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈటల ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, యేన్నెం శ్రీనివాస రెడ్డి బృందం నేడు భేటీ కానున్నది. పొంగులేటి బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత ఆయన వివిధ పార్టీల్లో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని, ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈటల బృందం ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి అన్నది చూడాలి.