వ్యవసాయం దండగ అన్న రైతు ద్రోహి చంద్రబాబునాయడు అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నందమూరులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఏపీ డిప్యూటి సిఎం కొట్టు సత్యనారాయణతో కలిసి కారుమూరి పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం కారుమూరి మాట్లాడుతూ తడిసిన, మొలకెత్తిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మొసలి కన్నీరు రైతులు నమ్మరని, అయన వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. తాము ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా రైతు నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదనే భయంతోనే బాబు డ్రామాలు ఆడుతున్నారని కారుమూరి ఎద్దేవా చేశారు. టిడిపి నేత పట్టాభి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేసి రశీదు పొందిన తర్వాత రైతుకు ఇక మిల్లుకు వెళ్ళాల్సిన పని లేదని, 14 ఏళ్ళ బాబు పాలనలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని డిప్యూటీ సిఎం కొట్టు విమర్శించారు. బాబు అడుగు పెడితే క్షామం, అధికారంలో ఉంటే గడ్డుకాలం అంటూ అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదని కొట్టు భరోసా ఇచ్చారు.