ప్రజా సమస్యలు, వారు ప్రభుత్వానికి ఇచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా ‘జగనన్నకు చెబుదాం’ పేరిట సరికొత్త కార్యక్రమానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనికోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. నేడు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్ధాయిలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో–జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
వైఎస్సార్ పెన్షన్ కానుక, రేషన్ కార్డు…..రైతన్నలకైనా, అక్కచెల్లెమ్మలకైనా, అవ్వాతాతలకైనా, మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో ఏమైనా సమస్యలున్నా
రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా
ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా
ప్రభుత్వ సేవలకు సంబంధించి ఇలాంటి ఏ సమస్య పరిష్కారానికైనా జగనన్నకు చెబుదాం – 1902 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయవచ్చు.
ఫిర్యాదును నమోదు చేసుకుని YSR (యువర్ సర్వీస్ రిక్వెస్ట్) ఐడీని కేటాయిస్తారు, ఎప్పటికప్పుడు మీ అర్జీ స్టేటస్ గురించి ఎస్‌ఎంఎస్ ద్వారా మీకు అప్‌డేట్ అందుతుందని, ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్ చేస్తామని అధికారులు చెప్పారు.
అనేక సమస్యలకు అత్యున్నత స్ధాయిలో పరిష్కారం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌లతో పాటు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందని చెప్పారు.