రాష్ట్రంలో అన్నార్థులు ఉండొద్దని, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ సర్కార్ పేదలకు రేషన్ పంపిణీ చేపడుతుందని, సంవత్సరానికి వేలకోట్లను వెచ్చిస్తూ నాణ్యమైన పోషకాల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ దారులకు ఇబ్బందులు రానివ్వద్దని సూచించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈమేరకు రేషన్ డీలర్ల సమస్యలపై నేడు హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పౌరసరఫరాల కమిషనర్ వి.అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
దాదాపుగా ప్రతీనెల 90 లక్షల కార్డులకు చెందిన 2కోట్ల 82లక్షల 60వేల మందికి 1.80 LMT’s కేటాయిస్తూ వీటికోసం 298 కోట్లు ఖర్చుచేస్తున్నామని, ఏటా 3580 కోట్లు రేషన్ కోసం ప్రభుత్వం ఖర్చుచేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్థుతం 17,220కు పైగా రేషన్ షాపులను నిర్వహిస్తున్నామని ఈ డీలర్లందరికీ నెలకు 12 కోట్ల పైచీలుకు కమిషన్ రూపంలో అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే పలుదపాలుగా రేషన్ డీలర్లతో చర్చించామని, వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై కసరత్తు చేయాలని అదికారులను ఆదేశించారు. ఈనెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశమవుతామని, సమ్మే ఆలోచన విరమించుకోవాలని డీలర్లకు సూచించారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పౌరసరఫరాల కమిషనర్ వి.అనిల్ కుమార్తో పాటు అధికారులు ఉషారాణి, లక్ష్మీభవాని తదితరులు పాల్గొన్నారు.