Friday, September 20, 2024
HomeTrending NewsAnnamayya: అన్నమయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి : మధుసూదన్

Annamayya: అన్నమయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి : మధుసూదన్

సంగీత, సాహిత్య, మాండలిక, భక్తి రంగాల్లో అపారమైన జ్ఞానం ఉన్న శ్రీ అన్నమయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాత్రికేయులు  పమిడికాల్వ మధుసూదన్ అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న సాహితీ సదస్సులు గురువారం ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన మధుసూదన్ ” అన్నమయ్య – బహుముఖ ప్రజ్ఞ ” అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య కీర్తనల్లో వేదం, ఉపనిషత్తులు, శాస్త్రం , మంత్రం, వ్యవసాయం, వాడుక భాషలోని సామెతలు, పలుకుబడులను ఉపయోగించి పామరులకు సైతం అర్థమయ్యేలా రచనలు చేశారని కొనియాడారు. జానపద బాణీలో రాసిన జోలపాటలు, చందమామ పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయని తెలిపారు. 500 ఏళ్ల క్రితం నాటి అన్నమయ్య సాహిత్యంలో నాటి వైభవాన్ని, సామాజిక జీవనాన్ని అద్భుతంగా వర్ణించారని ఆయన తెలిపారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆచార్య వెంకట రామకృష్ణ శాస్త్రి ‘అన్నమయ్య – వ్యాకరణ ప్రయోగాలు’ అనే అంశంపై ఉపన్యసించారు . అన్నమయ్య తన సంకీర్తనల్లో ఆనాటి వ్యవహారిక భాషను అందించారన్నారు. ఆయన సంకీర్తనల్లో సందులు, సమాసాలు, వ్యాకరణం ఉన్నాయన్నారు. అన్నమయ్య ప్రాచీన సాహిత్య భాషను పరిశోధకులు పరిశీలించాలని కోరారు. తరువాత విజయవాడకు చెందిన డాక్టర్ శ్యామలానంద ప్రసాద్ ‘అన్నమయ్య -మాండలికాలు’ అనే అంశంపై మాట్లాడారు.

సాయంత్రం 6 గంటల నుండి తిరుపతికి చెందిన శ్రీమతి అన్నపూర్ణ బృందం గాత్ర సంగీతం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు నెల్లూరుకు చెందిన శ్రీ దుర్గాప్రసాద్ బృందం హరికథ పారాయణం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్