ఇరుకు స్థలాల్లో నిరసనలు, ఊరేగింపులు, సభ లు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 ను కొట్టివేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందని తీర్పులో వెల్లడించింది.
డిసెంబర్ చివరి వారంలో కందుకూరు, జనవరి 1న గుంటూరులో జరిగిన చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రభుత్వం 2023 జనవరి 2న జీవో నెం.1ను తీసుకు వచ్చింది. ఈ జీవో ద్వారా ప్రజలు, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారంటూ సీపీఐ నేత రామకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ వాదిస్తూ రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారని వాదించారు, పోలీస్ యాక్ట్ 30కు కూడా ఇది భిన్నంగా ఉందని ధర్మాసనం ముందు విన్నవించారు. దీనిపై జనవరిలోనే విచారణ పూర్తి చేసిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించంది.