Mini Review: నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ‘కస్టడీ’, నిన్ననే థియేటర్స్ కి వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి, ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేస్తూ వచ్చారు. కథ వినగానే ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళతామా అనే ఆసక్తితో తాను ఎదురుచూసిన సినిమా ఇది అని ఇంటర్వ్యూస్ లో చైతూ చెప్పాడు. అంతగా ఆయనకి నచ్చిందంటే, కథలో బలమైన అంశాలేవో ఉన్నాయనే ప్రేక్షకులు అనుకున్నారు. కానీ వారి అంచనాలకు ఈ సినిమా దూరంగానే ఉండిపోయింది.
ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి .. ఆమె అప్పగించిన అక్రమాలను చేస్తూ వెళ్లే రౌడీ పాత్రలో అరవిందస్వామి .. ఆమె అవినీతికి రక్షణగా నిలిచే పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్ .. నిజాయితీ కలిగిన ఒక సాధారణ కానిస్టేబుల్ పాత్రలో చైతూ కనిపిస్తారు. ఈ నాలుగు ప్రధానమైన పాత్రలతో కలిసి ఈ కథ నడుస్తుంది. ఇక హీరోయిన్ గా కృతి శెట్టి ఉన్నప్పటికీ, ఆమె లేకపోయినా ఆ లోటు తెలిసే కథ కాదు ఇది. దీనిని బట్టి ఆమె పాత్రకి ఎంతటి ప్రాధాన్యం ఉందనేది అర్థం చేసుకోవచ్చు.
ఒక ప్రమాదకరమైన నేరస్థుడిని చట్టానికి పట్టించి, అతని వెనుక ఉన్న ముఖ్యమంత్రి ఆటకట్టించే ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది. వినడానికి లైన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అలాంటి ఈ కథ తెరపై పరుగులు పెడుతున్నప్పుడు, నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక కుతూహలం ఆడియన్స్ వైపు నుంచి తలెత్తాలి. పెద్ద తలకాయల అధికారం .. అవినీతి .. అక్రమార్కులను దాటుకుని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎలా ముందుకు వెళ్లాడనేది ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తించాలి. అలాంటి టెన్షన్ ను బిల్డప్ చేయలేకాపోవడమే ఈ సినిమా నిరాశపరడానికి ప్రధానమైన కారణమని చెప్పాలి. చైతూ ఇకపై కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పిన సినిమా ఇది.