చంద్రబాబు హయంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అమరావతి అని, కరకట్టపై చంద్రబాబు నివాసం ఉన్న ఇల్లు అక్రమాలకు చిరునామా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇంటి అలవెన్స్ పొందుతున్నారని, అసలు ఆ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది ప్రైవేట్ కట్టడమని తెలుగుదేశం పార్టీ చెబుతోందని, కానీ దేశభక్తితో రాష్ట్రం కోసం తాను ఆ గెస్ట్ హౌస్ ను ప్రభుత్వానికి ఇచ్చినట్లు లింగమనేని రమేష్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని గుర్తు చేశారు.
ఒకవేళ ప్రభుత్వ భవంతి అయితే సిఎం పదవి నుంచి దిగిపోగానే బాబు ఖాళీ చేయాల్సి ఉందని, లేదా ఆ భవనం ప్రతిపక్ష నాయకుడి హోదాలో తనకు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ అయినా రాసి ఉండాల్సింది అని సజ్జల పేర్కొన్నారు. కానీ ఇంకా అదే ఇంట్లో ఎలా ఉంటున్నారని నిలదీశారు. ఒకవేళ ప్రైవేటు గెస్ట్ హౌస్ అయితే ఆయన సిఎంగా ఉండగా దాన్ని ప్రభుత్వ నిధులతో ఎలా మరమ్మతులు చేస్తారని నిలదీశారు. అద్దెకు తీసుకున్నట్లు ఎక్కడైనా అగ్రిమెంట్ కానీ, లీజ్ డాక్యుమెంట్ కూడా లేదని సజ్జల స్పష్టం చేశారు.
భూ సమీకరణలో లింగమనేని భూములు పోకుండా అలైన్మెంట్ మార్చారని, దానికి ప్రతిఫలంగా లింగమనేని నాలుగు ఎకరాలు హెరిటేజ్ సంస్థకు ఇచ్చారని సజ్జల ఆరోపణ చేశారు. కచ్చితంగా దీనిలో క్విడ్ ప్రో కో జరిగిందన్నారు. ఈ అంశంలో చంద్రబాబు చేసిన అధికార దుర్వినియోగంపై మీడియా కూడా ప్రశ్నించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చి కొనేందుకు బాబు సిద్ధమవుతున్నారని, ఆ మేరకు అధికారంలో ఉండగా అవినీతి చేశారని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరకట్ట నివాసం విషయంలో నైతికంగా, న్యాయ పరంగా సమాధానం చెప్పుకోవాల్సి ఉందని, ప్రశ్నలు అడగాల్సింది చంద్రబాబునేనని చెప్పారు.