ఒకప్పుడు కొత్తగా కుర్రాళ్లు హీరోగా ఎంట్రీ ఇచ్చారంటే, కొంతకాలం వరకూ లవ్ స్టోరీస్ మాత్రమే చేసుకుంటూ వెళ్లేవారు. హీరోలు లవర్ బాయ్ ఇమేజ్ ను ఎక్కువగా కోరుకునేవారు. ఆ హీరో ప్రేమకథా చిత్రాలను చూడటానికి యూత్ ఎక్కువగా ఆసక్తిని చూపించేది. ఒకప్పుడు తెలుగులో హరీశ్ .. తమిళంలో అజిత్ .. అరవిందస్వామి .. సురేశ్ వంటివారు లవర్ బాయ్ ఇమేజ్ ను ఒక రేంజ్ లో మోశారు. ఆ తరువాత ఆ ఇమేజ్ నుంచి బయటపడటానికి నానా తిప్పలు పడ్డారు.
ఇక కొంతకాలం క్రితం వరకూ ఇక్కడ రామ్ కి లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. చాక్లెట్ బాయ్ అనిపించుకున్న అతను, కొంతకాలం క్రితం వరకూ అదే మార్క్ సినిమాలు చేస్తూ వెళ్లాడు. ఆ తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నుంచి ఆ ఇమేజ్ చట్రంలో నుంచి బయటపడటానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయంలో కొంతవరకూ ఆయన సక్సెస్ అయ్యాడు కూడా. ఇక త్వరలో ఆయన నుంచి రానున్న సినిమా కూడా యాక్షన్ నేపథ్యంలో నడిచేదే.
రీసెంట్ గా అఖిల్ కూడా తనకి ఉన్న ఇమేజ్ కి భిన్నంగా ‘ఏజెంట్’ సినిమా చేశాడు. ఇప్పుడు అదే బాటలో వైష్ణవ్ తేజ్ కూడా వెళుతున్నాడు. ఇంతవరకూ ప్రేమకథలు చేస్తూ వచ్చిన వైష్ణవ్ తేజ్, ‘ఆదికేశవ’ అనే సినిమాతో మాస్ యాక్షన్ లోకి దిగిపోయాడు. పవర్ఫుల్ టైటిల్ తో .. పక్కా మాస్ యాక్షన్ లుక్ తో ఆడియన్స్ కి జర్క్ ఇచ్చాడు. ‘రుద్రకాళేశ్వర్ రెడ్డి’ అనే అతనిపాత్ర పేరు కూడా పవర్ఫుల్ గానే ఉంది. నాలుగో సినిమాతోనే ఈ స్థాయి యాక్షన్ లోకి దిగిపోయిన ఈ మెగా బుల్లోడు, ఆడియన్స్ ను ఎంతవరకూ మెప్పిస్తాడనేది చూడాలి.