రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. పోలీస్ టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు సమిష్టిగా ఇందుకు కృషిచేయాలని సూచించారు. నకిలీ విత్తనాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సచివాలయంలో ఇరు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా కేంద్రంతో సమన్వయం చేసుకొని పక్కా ప్రణాళిక అమలుచేస్తున్నట్టు చెప్పారు. ఈ వానకాలం సీజన్‌కు పత్తి, మిరప, కందులు, వరి మిగిలిన అన్ని రకాలు కలిపి 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో గతంతో పోల్చితే నకిలీ విత్తనాల బెడద దాదాపుగా తగ్గిందని, అయినా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ విషయంలో టాస్‌ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కర్ణాటక, కర్నూలు నుంచి గద్వాలకు వచ్చేరూట్‌లో, గుంటూరు, ప్రకాశం నుంచి ఆసిఫాబాద్, బెల్లంపల్లి వచ్చే రూట్‌లో, గుజరాత్ నుంచి జహీరాబాద్ మీదుగా వచ్చే రహదారులపై ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి నిఘా పెంచాలని ఆదేశించారు. నిషేధిత హెచ్‌టీ పత్తి విత్తనాలు వినియోగించకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఏకంగా రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత భారీగా ఖర్చు చేసిన దాఖలాలు లేవని అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యమని, సీఎం కేసీఆర్ చొరవతోనే దేశంలో తెలంగాణ వ్యవసాయరంగానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలిపారు. పల్లెసీమలు బాగుపడ్డాయని, వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకత పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని చెప్పారు. సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్, సీఐడీ చీఫ్ మహేశ్ భాగవత్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీఐజీ షానవాజ్ ఖాసీం, డీఐజీ ఇంటెలిజెన్స్ కార్తికేయ, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంత్ కొండిబ, ఉద్యాన శాఖ డైరెక్టర్ హన్మంతరావు, మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ ఎండీ కేశవులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఏవోలు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.