అమరావతిలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల మాజీ మంత్రి కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు ఇస్తే వారంతా వైసీపీకి ఓటు వేస్తారని, మంగళగిరిలో మళ్ళీ లోకేష్ ఓడిపోతాడనే భయంతోనే తెలుగుదేశం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. పేదలు ఎక్కడ ఉంటే అక్కడ లోకేష్ ఓడిపోతాడని వారు భావిస్తున్నారని, వైసీపీ పేదల పార్టీ అని తాను మొదటినుంచీ చెబుతున్నానన్నారు. టిడిపి, జనసేన పార్టీలకు గత ఎన్నికల్లో ఒకరికి 23, మరొకరికి ఒక సీటు ఇచ్చారని… వారు ఇలాగే ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో అవికూడా రావని విమర్శించారు.
జగన్ ను హీరోగా, బాబును విలన్ గా పెట్టి.. వారి వెనకాల ఉండే అసిస్టెంట్లుగా పవన్ కళ్యాణ్, రామోజీరావు, బిఆర్ నాయుడు, రాధాకృష్ణలను పెట్టి.. ఎలా దోచుకోవాలి, సూట్ కేసుల విషయంలో అత్తా కోడళ్ళు ఎలా జుట్టు పట్టుకు కొట్టుకుంటారనేది సినిమా తీస్తే రసవత్తరంగా ఆడుతుందని ఎద్దేవా చేశారు. పవన్ నిర్మాతగా ఉంటే, హీరోను తాము చూస్తామన్నారు. అవసరమైతే రామ్ గోపాల్ వర్మతో మాట్లాడి ఒప్పిస్తానన్నారు. జగన్ సింగల్ గా వస్తారని, అందరినీ గుద్దలూడదీసి పంపుతారని దుయ్యబట్టారు. 2024 తరువాత పవన్ కు మిగిలేది సినేమాలేనని వ్యాఖ్యానించారు.