Saturday, November 23, 2024
HomeTrending News'ఉపాధి హామీ' బకాయిలు ఇవ్వండి

‘ఉపాధి హామీ’ బకాయిలు ఇవ్వండి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన 6,750 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు  కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఉపాధి పనుల బకాయిల విడుదలతోపాటు పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. ఈ మేరకు ఎంపీలందరూ సంతకాలు చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు.

ఈ భేటీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 18.4 కోట్ల పని దినాలను కల్పించి దేశంలోనే అత్యధిక పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు నెలకొల్పిందని తెలిపారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 16.7 కోట్ల పని దినాలను కల్పించి కూలీల బడ్జెట్‌లో 83.5 శాతం వినియోగించుకుంది. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అత్యధిక ఉపాధి కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు.

2006లో దేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ పథకం కింద ఉపాధి కల్పించింది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని వారు కేంద్ర మంత్రికి వివరించారు. కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన విలయం నేపధ్యంలో ఉపాధి పనులకు ఏర్పడిన డిమాండ్‌ దృష్ట్యా  రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పేదలకు కనీసం ఒక కోటి పని దినాలు కల్పించాలని గత ఏప్రిల్‌లో సిఎం జగన్ నిర్దేశించిన లక్ష్యాన్ని తొమ్మిది జిల్లాల్లో విజయవంతగా చేరుకోగలిగినట్లు చెప్పారు.

గ్రామీణ ఉపాధి పథకం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఈ పథకాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి చొరవ తీసుకోవలసిందిగా విజయసాయి రెడ్డి మంత్రిని కోరారు.

ఆ చర్యలలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ ఖర్చును 20 లక్షల రూపాయలకు పెంచాలని, ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు ఉపయుక్తంగా ఉండే టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగు నీరు, క్రీడా సౌకర్యాల కల్పిన కోసం ఉపాధి పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 15 లక్షలకు పెంచాలని కోరారు. మిగిలిన 5 లక్షల రూపాయలు ఐసీడీఎస్‌ వాటా కింద చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా సర్వే రాళ్ళు పాతే కూలీలకు వేతనాలను ఉపాధి పథకం కింద వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పథకం కింద లేబర్‌ బడ్జెట్‌ను సవరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్