తనది ముందు చూపు అయితే జగన్ ది దొంగ చూపు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్ధిక సంస్కరణలు చేపట్టి సంపదను తాను సృష్టిస్తే, వైసీపీ నేతలు ఆ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. పేదవారిని ధనికులుగా చేయాలన్నదే తన జీవితాశయమని, అదే లక్ష్యంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. జగన్ హయంలో అన్ని వ్యవస్థలూ విధ్వంసానికి గురయ్యాయన్నారు. నిరుపేదలను ఎగాతాళి చేసేలా జగన్ పాలన ఉందన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోటలో దాసరి సామాజిక వర్గంతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు తొలగిస్తానంటూ వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని కానీ ఆ పార్టీ నేతలు బొక్బొకుతున్న దాన్ని అరికట్టి ప్రజలకు మరింత సంక్షేమం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని వనరులూ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉందని ఆ శనిపెరే జగన్ అని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి భయపడి పరిశ్రమలు పారిపోయే పరిస్థితి వచ్చిందని, 30 ఏళ్ళ క్రితం పరిశ్రమలు పెట్టినవారు కూడా పారిపోతున్నరన్నారు.
రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టానని, కరెంట్ కోతలు లేకుండా చూశామని, ఎక్కడైనా కరెంట్ పొతే స్థానిక అధికారి ఔట్ అన్న విధంగా పనిచేశామన్నారు. ఒకప్పుడు యూనిట్ 5-6 రూపాయలు ఉండేదని…. సోలార్, విండ్ పవర్ ను ప్రోత్సహించి 2.30 రూపాయలకే యూనిట్ విద్యుత్ తగ్గించామని గుర్తు చేశారు. భవిష్యత్తులో 1.50 రూపాయికే వస్తుందని చెప్పానని…. అలాంటి విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశాడని దుయ్యబట్టారు. ప్రతి ఇంట్లో, పొలంలో సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించామన్నారు.
దాసరి కులస్తులను ఎస్టీల్లో చేర్చే విషయమై గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, తాము అధికారంలోకి రాగానే మరోసారి ఈ అంశంపై దృష్టి సారిస్తామని చెప్పారు.