Mini Review: విజయ్ ఆంటోని హీరోగా .. ఆయనే దర్శక నిర్మాతగా ‘బిచ్చగాడు 2’ నిన్న థియేటర్లకు వచ్చింది. చాలా కాలం క్రితం ఆయన నుంచి వచ్చిన ‘బిచ్చగాడు’ తెలుగు వెర్షన్ కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. అందువలన సహజంగానే ‘బిచ్చగాడు 2’ పట్ల భారీస్థాయి అంచనాలు ఉన్నాయి. ఇక విజయ్ ఆంటోనికి కూడా ‘బిచ్చగాడు’ తరువాత సరైన హిట్ పడలేదు. దాదాపు ఆయన కెరియర్ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది.
ఈ విషయాన్ని గ్రహించే ఆయన ‘బిచ్చగాడు 2’ను తెరపైకి తీసుకుని వచ్చాడు. నిన్ననే ఈ సినిమా థియేటర్స్ కి వచ్చింది. విజయ్ ఆంటోని జోడీగా కావ్య థాపర్ నటించిన ఈ సినిమాలో, దేవ్ గిల్ .. హరీశ్ పేరడి .. జాన్ విజయ్ .. రాధారవి ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘బిచ్చగాడు’ స్థాయిలో ఈ సినిమా ఉందా అనే ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ‘బిచ్చగాడు’ మదర్ సెంటిమెంట్ తో నడించింది. ‘బిచ్చగాడు 2’ సిస్టర్ సెంటిమెంట్ తో కొనసాగుతుంది. అందువలన ఈ సినిమాను ఈ సినిమాగానే చూడాలి.
విజయ్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్టాఫ్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త స్లో అయినప్పటికీ, క్లైమాక్స్ కి సెట్ అవుతుంది. యాక్షన్ .. ఎమోషన్ తో కలిసి ఈ కథను నడిపించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇక సంగీత దర్శకుడిగా కూడా విజయ్ ఆంటోనికి ఫుల్ మార్క్స్ ఇవ్వొచ్చు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. కథకి తగిన కథనం .. కథనానికి తగిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. టోటల్ గా చూస్తే విజయ్ ఆంటోని హిట్ కొట్టినట్టే అనిపిస్తుంది.