Saturday, November 23, 2024
HomeTrending NewsTirumala: ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో మార్పులు

Tirumala: ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో మార్పులు

వేసవి రద్దీ కారణంగా విఐపి దర్శనాలు, సిఫార్సు లేఖలతో పాటు ఆర్జిత సేవలలో మార్పులు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయం తీసుకుంది.  కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్యభక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామివారి సేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేయడం జరిగింది. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది.

గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది.

శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదు. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. తద్వారా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుంది.

క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం అవుతుంది.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని వైవి.సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్