Sunday, November 24, 2024

మారకము- విలువ

Y ‘2K’ Problems:

1. ప్రశ్న:-
సరిగ్గా చెప్పండి సార్. రెండు వేల నోట్లు మార్చుకోవడానికి మేము ఏయే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది?

సమాధానం:-
మీ డబ్బు మీరు మార్చుకోవడానికి డాక్యుమెంట్లు ఎందుకండీ? కాకపోతే ఆధార్ కార్డు జెరాక్స్, ఓటరు కార్డు ఒరిజినల్, మీరు బతికి ఉన్నట్లు డాక్టర్ సర్టిఫికెట్ ఒరిజినల్, ఆ డబ్బు మీదే అని ఆడిటర్ రిపోర్ట్, మీ ఐ టీ రిటర్న్ సాఫ్ట్ కాపీ, ఒక పాస్ పోర్టు సైజు మీ కొత్త ఫోటో ఉంటే సరిపోతుంది.

2. పరి ప్రశ్న:-
మాకు పిచ్చి పట్టలేదని ఎర్రగడ్డలో స్టేబుల్ మెంటల్ సర్టిఫికేట్ అక్కర్లేదా సార్?

పరి సమాధానం:-
బాగా గుర్తు చేశారు. ఆర్ బి ఐ అవసరం లేదని అంటోంది కానీ…మా బ్యాంకు ముందు జాగ్రత్తగా మెంటల్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటోంది. ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకుని…జెరాక్స్ ఒక్కటి మాకివ్వండి. చాలు.

3. పరి పరి ప్రశ్న:-
సార్! మా ఇంట్లో నాకు, నా భార్యకు, నా పిల్లలిద్దరికీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. నా దగ్గర రెండు వేల నోట్లు యాభై ఉన్నాయి. ఇప్పుడు నేనొక్కడినే మెంటల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుందా? చాలా పెద్ద మొత్తంలో రెండు వేల నోట్ల నగదు నిల్వలు ఉన్నందుకు నలుగురమూ మెంటల్ స్టేబుల్ సౌండ్ సర్టిఫికేట్ తీసుకోవాలా?

పరి పరి సమాధానం:-
నైతికంగా అయితే నలుగురూ తీసుకోవాలి. మీరు మాకు పాత మెంటల్ కేసు కాబట్టి...ఒక మెంటల్ సర్టిఫికేట్ మీద మేనేజ్ చేస్తాను. భవిష్యత్తులో మీ ఇంటి మీద ఐ టీ రైడ్ జరిగినప్పుడు నా పేరు మాత్రం దయచేసి చెప్పకండి. చచ్చి మీ కడుపున పుడతాను.

4. పరివేదన:-
నేను చచ్చినా మీరు నా కడుపున పుట్టడానికి ఒప్పుకోను. ఒకవేళ మీరు తొందరపడి చచ్చినా…మీరు కడుపుకు అన్నమే తింటుంటే…దయచేసి వేరే వారి కడుపు చూసుకోండి.

సంవేదన:-
నేనేమి మాట్లాడాను? మీరేమి మాట్లాడుతున్నారు? నేను కడుపుకు అన్నం తప్ప అశుద్ధం, నానా గడ్డి తింటున్నానని అంటారా? ఇదేనా బ్యాంకు మేనేజర్ కు ఇచ్చే మర్యాద?

5. సంవాదం:-
మరి- నా రెండు వేల నోటు నేను మార్చుకోవడానికి మీరు మతిలేని మాటలు మాట్లాడితే…మెంటల్ ఎవరన్నట్లు? మీరా? నేనా?

వాగ్వాదం:-
అయ్యా! నిజమే. కస్టమర్లు దేవుళ్లు. మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. రోజుకో నోటు పుట్టి…రోజుకో నోటు చస్తూ ఉండడంతో ఒత్తిడి, తొక్కిసలాట తప్పించడానికి మీరు ఏ డాక్యుమెంట్లు తీసుకు రాలేరో…వాటినే అడుగుతూ ఉండమని మాకు పైనుండి ఆదేశాలు. భార్యా పిల్లలు గలవాడ్ని. దయచేసి క్షమించండి. ఇవి చేతులు కావు. కాళ్లనుకోండి.

ఫలితం:-
కస్టమరు విజయ గర్వంతో రెండు వేల నోటు మార్చుకోవడానికి ఏర్పడ్డ అయిదు కిలో మీటర్ల క్యూలో ఎర్రటి ఎండలో నడి రోడ్డు మీద నిలుచుని…తన వంతు కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు!

ప్రభుత్వ మీడియా వార్తలు:-
భారత దేశంలో రెండు వేల నోట్ల మార్పిడి ప్రశాంత వాతావరణంలో, చల్లగా జరుగుతోందని ఆర్ బి ఐ నిన్న అర్ధ రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మార్పిడిలో ఎలాంటి తొక్కిసలాటలు జరగడం లేదని…మారక ఇప్పటి దాకా ఎవరూ గుండె పోటుతో మరణించలేదని ఆర్ బి ఐ హర్షం వ్యక్తం చేసింది.

ఇప్పుడొక విరామం. తరువాత జన్ కీ బాత్…క్షమించాలి…మన్ కీ బాత్ అనువాదం తప్పక విని తీరాల్సి ఉంటుంది!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్