Monday, May 20, 2024
HomeTrending NewsSajjala: అవినాష్ విషయంలో తప్పుడు ప్రచారం: సజ్జల

Sajjala: అవినాష్ విషయంలో తప్పుడు ప్రచారం: సజ్జల

రాష్ట్రానికి మంచి జరిగితే కొంతమంది తట్టుకోలేకపోతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. చెడు జరిగితే బాధపడడం గానీ, మంచి జరిగితే ఆహ్వానించడం గానీ చేయలేకపోతున్నారని ఆరోపించారు. సిఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.  2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద విడుదల చేసింది. దీనిపై ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ… గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో  ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చారంటూ కడుపు మంట ప్రదర్శించారని, ఎన్నికల సమయంలో జగన్ సర్కారుకు భారీ ఊరట అంటూ వారు అక్కసు వెళ్ళగక్కారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ ఏం చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనమని సజ్జల స్పష్టం చేశారు.

వైఎస్ అవినాష్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే డ్రామాలు అంటూ ప్రచారం చేయడంపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి అనారోగ్యంపై సిబిఐకి అవినాష్ రెడ్డి సమాచారం అందించారని, విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని అడిగారని, కానీ దీనిపై మీడియా అతిగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని చూసి కొంతమంది ఆవేశానికి గురై దాడి చేసి ఉంటారని, మీడియాపై దాడిని పార్టీ పరంగా ఖండిస్తున్నామని చెప్పారు. కేంద్ర బలగాలు వస్తున్నాయని, రాష్ట్రపతి పాలన పెడుతున్నారని కూడా ప్రచారం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.  సిబిఐకి ఏపీ పోలీస్ అధికారులు సహకరించడం లేదన్న వార్తలను కూడా  తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని సిబిఐ ఏమైనా చెప్పిందా అంటూ ఎదురు ప్రశ్నించారు.

తమ పార్టీ విజయం సాధించి నేటికి నాలుగేళ్ళు పూర్తయ్యిందని,  ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్దితో పని చేస్తున్నామని సజ్జల చెప్పారు. సిఎం జగన్ ఈ నాలుగేళ్ళలో 98.5శాతం హామీలు నెరవెర్చారని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్