జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రెవిన్యూ లోటు సాధించినందుకు మహానాడులో తీర్మానం చేసి ఉంటే బాగుండేదని వైసీపీ నేత, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో వ్యవహరించకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని, ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించి, స్వార్ధ ప్రయోజనాల కోసం ఆలోచించారని భరత్ విమర్శించారు. కానీ సిఎం జగన్ కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతూ 2014-15 రెవిన్యూ లోటు 10,460 కోట్ల రూపాయల నిధులను సాధించగలిగారని, ఏపీ రాష్ట్రం విడిపోయిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం ఇదే తొలి సారి అని గుర్తు చేశారు. సిఎం జగన్ ఢిల్లీ పర్యటనల వల్ల ఏం సాధించారని అడిగేవారికి ఇదే సమాధానం అని స్పష్టం చేశారు.
దీనితో పాటు పోలవరం అంచనా వ్యయం 55 వేల కోట్ల రూపాయలకు పెంచుతూ పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పిపిఏ) తీసుకున్న నిర్ణయాన్ని కూడా కేంద్రం ఆమోదించేలా సిఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే నిన్న కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారని, త్వరలోనే కేంద్రంనుంచి దీనిపై కూడా సానుకూల నిర్ణయం వెలువడుతుందని భరత్ ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ కర్త, కర్మ, క్రియ మొత్తం ఎన్టీఆర్ అయితే ఆయన్ను దారుణంగా వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు శతజయంతి వేడుకలు చేస్తున్నారని విమర్శించారు. బాబును ఔరంగజేబుగా, గాడ్సేగా ఎన్టీఆర్ అభివర్ణించారని.. నాడు ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలను ఈనాటి యువతరానికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
తాత శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారో తెలుసుకో వాలన్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఆయన్ను వాడుకొని ఆ తర్వాత కొడుకు లోకేష్ కోసం వదిలేశారని భరత్ ధ్వజమెత్తారు.