తెలుగు ప్రజలు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో అందరం నవంబర్ 1న మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాలు జరుపుకుంటామని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇవాళ ఎందుకు శుభాకాంక్షలు తెలిపారో చెప్పాలని, పైగా జగన్ ను కూడా విషెస్ చెప్పాలంటూ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. అసలు బాబు మైండ్ ఉండి మాట్లాడారో లేదో అర్ధంకావడంలేదన్నారు. రాష్ట్రం విడిపోయినందుకు బాబుకు సంతోషంగా ఉండి శుబాకాంక్షలు చెప్పారా అంటూ నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని మీడియాతో మాట్లాడారు.
రాస్త్రాన్ని విడగొట్టాలని తానే చెప్పానంటున్న చంద్రబాబు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ కూడా చెప్పారని, అసలు ఆయన పెరేత్తే అర్హత బాబుకు లేదన్నారు. బాబు గంటా 23 నిమిషాలపాటు నేడు ఊకదంపుడు ఉపన్యాసంలో పివి నరసింహారావు, పొట్టి శ్రీరాములు పేర్లు ప్రస్తావించారని, కానీ వారు చేసిన మంచిని ఎందుకు వివరించి చెప్పలేదని అడిగారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనంటూ బాబు చెప్పేవి సొల్లు మాటలని, అసలు ఐటి పార్క్ కు రూపకల్పన చేసింది నేదురుమిల్లి జనార్ధన్ రెడ్డి గారు అయితే, వైయస్ సిఎం అయ్యేనాటికి హైటెక్ సిటీకి సరైన రోడ్డు కూడా లేదని పేర్ని పేర్కొన్నారు. బాబు కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు పులిహోర కలిపాడని సిఎం జగన్ అంటే దాన్ని కూడా తెలుసుకోలేని స్థితిలో బాబు ఉన్నాడని… పులిహోర కలపడం అంటే మాయమాటలు చెప్పడమని నాని అన్నారు.
పవన్ వారాహి యాత్రపై కూడా నాని సెటైర్లు వేశారు. అదో సినిమా ప్రమోషన్ యాత్ర లాంటిందని, ఇది చంద్రవరం యాత్ర అని అభివర్ణించారు. అమరావతి-తిరుపతి; అమరావతి-అరసవిల్లి అయిపోయిందని, ఇప్పుడు అన్నవరం-భీమవరం అంటున్నారని ఇదేమైనా టూర్ ప్యాకేజా అని వ్యాఖ్యానించారు. ప్రతి సినిమా మొదలు పెట్టేటప్పుడు నిర్మాతలు.. వంద కోట్లు వసూలవుతుందని, రికార్డు సృష్టిస్తుందని చెబుతారని అలానే పవన్ యాత్రకు కూడా ప్రమోషన్ చేస్తున్నారన్నారు. షూటింగ్ లు అయిపోయాయి కాబట్టే పవన్ యాత్ర మొదలు పెట్టారన్నారు. పవన్ యాత్రకు పర్మిషన్ ఇవ్వాల్సింది బాబేనని, దసరా నుంచే మొదలు పెడతామని చెప్పారని, లోకేష్ యాత్ర మొదలైంది కాబట్టి కొన్నాళ్ళు ఆగమని బాబు చెబితే ఇప్పటిదాకా ఆగారని నాని విమర్శలు చేశారు.