ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకొని తగిన చికిత్సలు తీసుకుంటే క్యాన్సర్ బారినుంచి త్వరగా విముక్తి పొందవచ్చని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. తానూ అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకొన్నప్పుడు non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారని వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో క్యాన్సర్ పెద్ద రోగమేమీ కాదని, ముందస్తుగా గుర్తిస్తే నివారణ సాధ్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంకాలజీ విభాగాన్ని చిరంజీవి ప్రారంభించారు.
జీనోమిక్స్ టెస్ట్ ద్వారా ముందస్తుగానే క్యాన్సర్ ను గుర్తించవచ్చని, క్యాన్సర్ పై అవగాహన కోసం తన వంతు సహకారాన్ని అందిస్తాననని హామీ ఇచ్చిన చిరంజీవి హైదరాబాద్ క్యాన్సర్ నియంత్రణకు హబ్ కావాలని ఆకాంక్షించారు.
అభిమానుల కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తానని, అభిమానులకు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్కీనింగ్ టెస్ట్ లు చేయిస్తానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ క్యాన్సర్ స్కీనింగ్ చేయాలని స్టార్ హాస్పిటల్ వైద్యులను చిరంజీవి కోరారు.
కాగా ప్రసార మాధ్యమాల్లో చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారని, ముందస్తుగా చికిత్స తీసుకొని బైట పడ్డారంటూ వార్తలు వెల్లువెత్తాయి. దీనిపై చిరంజీవి వివరణ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు.
“కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను. అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు” అంటూ పోస్ట్ చేశారు.