ప్రతివారం బ్లాక్‌బస్టర్ సినిమాలను అందిస్తూ, సినీ ప్రేమికులకు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తామని చేసిన మాటను నిలబెట్టుకుంటోంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా`. ఇందులో అందరిలో ఎంతగానో ఆసక్తిని పెంచడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను అందుకున్న చిత్రం `సూపర్ డీలక్స్` చిత్రం ఆగస్ట్ 6న విడుదలవుతుంది. ఈ అంథాలజీలో విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, సమంత, ఫహాద్ ఫాజిల్, మిస్కిన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి శిల్ప అనే ట్రాన్స్ జెండర్‌గా ఆకట్టుకున్నాడు. మాణిక్యం అనే యువకుడు పెళ్లైన తర్వాత ఇంటి నుంచి వెళ్లి పోయి కొన్నేళ్ల తర్వాత శిల్ప అనే ట్రాన్స్ జెండర్‌గా తిరిగి వచ్చినప్పుడు అతని భార్య, కొడుకు షాకవుతారు. ఎల్‌జీబీటీక్యూఐఏ అనే కమ్యూనిటీని శిల్ప అనే పాత్రలో విజయ్ సేతుపతి వెండితెర పై చక్కగా ఆవిష్కరించాడు. ఈ పాత్రలో నటించినందుకు, విజయ్ సేతుపతి ఉత్తమ సహాయ నటుడిగానూ జాతీయ అవార్డు అందుకున్నారు.
ఎలాంటి ప్రేమ లేని ఇద్దరు భార్యాభర్తలుగా ఫహాద్ ఫాజిల్, సమంత అక్కినేని నటించారు. అనుకోకుండా వారింట్లో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి వారు చేసే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన నటీనటుల ప్రదర్శనల వల్ల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటుంది. అలాగే చెప్పుకోలేని గతం నుంచి వచ్చిన లీల ఓ మంచి జీవితాన్ని జీవించాలని అనుకున్నప్పుడు ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే మరో భాగం.. ఇందులో రమ్యకృష్ణ అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
భార్గవి పెరుమాల్, గాయత్రి శంకర్, ఫిల్మ్ మేకర్ మిస్కర్ తదితరులు సినిమాను ముందుకు తీసుకెళ్లే ఇతర కీలక పాత్రల్లో నటించారు. సూపర్‌డీలక్స్ చిత్రంలో తెరకెక్కించిన నాలుగు కథలు, వారి జీవితాల్లోని ఒడిదొడుకులను ఎదుర్కొని వారెలా బయటపడ్డారనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి ప్రేక్షకులు, విమర్శకుల మెచ్చే చిత్రాలను అందిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏకైక గమ్యంగా ‘ఆహా’ మాధ్యమం ఉంది. క్రాక్, ఖైది, సుల్తాన్, నాంది, జాంబిరెడ్డి, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, చావు కబురు చల్లగా, కుడి ఎడమైతే, సామ్ సామ్ జామ్, లెవన్త్ అవర్ సహా ఎన్నో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు, వెబ్ ఒరిజినల్స్, షోస్‌తో ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది `ఆహా`.