ఒకే ఫ్యామిలీ నుంచి అన్నదమ్ములుగా వచ్చి హీరోలుగా కొనసాగుతున్నవారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పచ్చు. తెలుగులో చిరంజీవి – పవన్ కల్యాణ్ ముందువరుసలో కనిపిస్తారు. ఆ తరువాత స్థానంలో కోలీవుడ్ లో సూర్య – కార్తి నిలుస్తారు. ఇక తెలుగులో ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ – ఆనంద్ దేవరకొండ, బెల్లంకొండ శ్రీనివాస్ – గణేశ్ ఈ జాబితాలో కనిపిస్తున్నారు. బెల్లంకొండ గణేశ్ – ఆనంద్ దేవరకొండ మాత్రం ఇంకా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ ను ఇక్కడి ప్రేక్షకులు మాస్ యాక్షన్ హీరోగా గుర్తించారు. అందుకు సంబంధించిన కంటెంట్ తన సినిమాల్లో ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఈ మధ్య ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో చేశాడు. ఆ సినిమా కోసం ఆయన కొంతకాలం పాటు తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడు. అటు అంత కష్టపడినా ‘ఛత్రపతి’ ఫలితం నిరాశపరిచింది.
దాంతో ఇక తెలుగులో వచ్చిన గ్యాప్ ను తగ్గించాలనే ఆలోచనలో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు. సాధ్యమైనంత త్వరగా సాగర్ కె చంద్ర సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాడు. రీసెంటుగా బెల్లంకొండ గణేశ్ నుంచి వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ సినిమా కూడా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. అన్నదమ్ములిద్దరూ హీరో కంటెంట్ ఉన్నవారే. అయితే సరైన కథలపై వారు దృష్టి పెట్టవలసి ఉంది. యువ హీరోల పోటీని తట్టుకోవడానికి తగిన కసరత్తును చేయవలసి ఉంది.