2023లో టెన్త్, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చినవారికి జూన్ 15న, జిల్లా స్ధాయిలో జూన్ 17, రాష్ట్ర స్ధాయిలో జూన్ 20న అవార్డులు అందించనున్నారు. రాష్ట్ర స్ధాయి అవార్డులు సిఎం జగన్ స్వయంగా అందించనున్నారు. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని అధికారులు సిఎంకు వివరించారు. జగనన్న ఆణిముత్యాలు పేరుతో విద్యార్ధులకు ఇవ్వనున్న మెడల్స్ జగన్ పరిశీలించారు. అకడమిక్ క్యాలెండర్ 2023–24 ను సిఎం విడుదల చేశారు.
ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లకు చెందిన 64 మంది విద్యార్థులు టాప్ 10 ర్యాంకులు… ప్రభుత్వ కాలేజీలకు చెందిన 27 మంది విద్యార్ధులు టాప్ 10 ర్యాంకులను సాధించినట్టు అధికారులు తెలియజేశారు.
ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని, ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్‌గా ఉండాలని సిఎం సూచించారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూల్స్‌ను ఏర్పాటుచేసి వాటిని జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. వచ్చే జూన్ నాటికి ఈ జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలని నిర్దేశించారు. నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలని అధికారులను ఆదేశించారు.
మొదటి దశ నాడు–నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు, ట్యాబ్‌ల వినియోగం, అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం, నాడు-నేడు రెండోదశ, గోరుముద్ద, ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్ అంశాలపై కూడా సిఎం సమగ్ర సమీక్ష జరిపారు.