విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనపై సిఎం జగన్ నోరు విప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలకు ఈ ఘటన పరాకాష్టగా అభివర్ణించారు. రిషికొండలో స్వయంగా సిఎం జగన్ నివాసం ఉండబోయే ప్రాంతంలో ఈ ఘటన జరిగిందన్నారు. పోలీసులు-ముద్దాయిలు కలిసి పనిచేస్తున్నారన్న విషయం ఈ దుశ్చర్యతో రుజువైందన్నారు. దొంగలు దొంగల పంచాయతీల్లో కేవలం వాటాల పంచాయతీ కోసమే ఇది జరిగిందని పేర్కొన్నారు. విశాఖలో నాలుగేళ్లుగా లుంగీ బ్యాచ్ పంచాయతీలు చేస్తూనే ఉన్నారని, దాదాపు 40వేల ఎకరాలు దోచుకున్నారని, భూకబ్జాలకు పాల్పడుతున్నారని, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. గతంలో హనుమాయమ్మ ఘటన జరిగినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇది జరిగి ఉండేది కాదని అన్నారు. ఈ ఘటనపై విశాఖ సిపి, డిజిపిలు డ్రామాలు అల్లుతున్నారని, వీరికి రాష్ట్రపతి మెడల్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ పాశవిక హత్యకు నిరసనగా కొండపల్లి లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉమా పాల్గొన్నారు. బాపట్ల విద్యార్థి అమర్ నాథ్ హత్యకు సిఎం, డిజిపిలే బాధ్యత వహిచాలని ఉమా డిమాండ్ చేశారు. గంజాయి, మత్తుమందుల విచ్చలవిడి వాడకం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.