Sunday, November 24, 2024
Homeసినిమాతెలుగులో ఇది 'ఆదిపురుష్'కి కలిసొచ్చే అంశమే!

తెలుగులో ఇది ‘ఆదిపురుష్’కి కలిసొచ్చే అంశమే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఇప్పుడు ‘ఆదిపురుష్’ గురించే మాట్లాడుకుంటున్నారు. రామాయణంలోని అత్యంత కీలకమైన ఘట్టాలను ఓం రౌత్ చాలా తేలికగా మార్చేశాడే అంటూ మాట్లాడుకుంటున్నారు. శ్రీరాముడి మేనిఛాయ దగ్గర నుంచి హనుమంతుడి ‘గద’ వరకూ ఆయన తనదైన ముద్రను చూపించడానికి ప్రయత్నించాడు. హనుమంతుడు సిల్వర్ కలర్ ‘గద’ వాడటం మనం ఈ సినిమాలోనే చూస్తాం. అటు అయోధ్య పట్టణం … ఇటు లంకా నగరం … ఈ మధ్యలోని  కిష్కింధ చూపించకుండా రామాయణం తీయడం ఓం రౌత్ కే చెల్లింది.

కథ ఆరంభంలోనే .. ‘ఆకాశం రంగు మారింది … నా మనసుకేదో కీడు తోస్తోంది’ అని సీతాదేవి అంటే, ‘ఆకాశం ఎప్పుడూ ఇలాగే కదా ఉంటుంది’ అంటూ లక్ష్మణుడు చెప్పిన ధోరణి చూస్తే, సీతాదేవికి .. లక్ష్మణుడికి మధ్య మాటలు లేవా ఏంటి? అనే అనుమానం రాకపోదు. అలా అక్కడి నుంచే ఓం రౌత్ తన మార్కును చూపించడం మొదలుపెట్టాడు. ‘శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు’ అని రామాయణంలో చెప్పిన మారీచుడు, ఒంటినిండా పచ్చబొట్లతో మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తాడు.

ఇలా ఈ సినిమా కథ మొదలైన దగ్గర నుంచి అనేక విమర్శలు ఎదురవుతున్నా, వసూళ్ల జోరు మాత్ర ఎంతమాత్రం తగ్గడం లేదు. రామాయణం పట్ల ప్రజానీకానికి గల అభిమానమే అందుకు కారణమని అనుకోవాలి. మొదటి రోజున 140 కోట్లు .. రెండో రోజున 240 కోట్లు … మూడో రోజున 340 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా, వసూళ్ల పరంగా దూసుకుపోతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకూ, వచ్చేనెలలో కూడా చెప్పుకోదగిన సినిమాలేమీ లేవు. ఇది తప్పకుండా ఇక్కడ ‘ఆదిపురుష్’ కి కలిసొచ్చే అంశమే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్