Saturday, September 21, 2024
HomeTrending NewsDwarampudi: అది వారాహి కాదు నారాహి: ద్వారంపూడి

Dwarampudi: అది వారాహి కాదు నారాహి: ద్వారంపూడి

కాకినాడలో పోటీ చేయాలని సవాల్ చేస్తే పవన్ కళ్యాణ్ తోక ముడుచుకొని పారిపోయారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు.  పవన్ కు స్క్రిప్ట్ రాసిస్తున్నవారు జాగ్రత్తగా రాయాలని సూచించారు. ఏది పడితే అది రాసిస్తే దాన్నే చదివి పరువు పోగొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏది చెబితే అదే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కావాలని అనుకునే వ్యక్తి విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.  హైదరాబాద్ లో చంద్రబాబు-పవన్ కుమ్మక్కయ్యారని, అది వారాహి కాదని నారాహి అని, ఆ వాహనం ఎక్కిన పవన్ నిత్యం ద్వారంపూడి జపం చేస్తున్నారని విమర్శించారు. కాపు ఉద్యమం కోసం ముద్రగడ పద్మనాభం  తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారని, అలాంటి వ్యక్తిపై విమర్శలు చేసే స్థాయి జనసేనలో ఎవరికీ లేదన్నారు.

బెస్ట్ లివింగ్ సిటీగా కాకినాడకు పేరుందని…  డ్రగ్స్, మాఫియా ఆరోపణలతో కాకినాడ ప్రతిష్టను దెబ్బతీయవద్దని కోరారు. పవన్ విమర్శలకు బాధపడిన పోర్టు కార్మిక సంఘాలు ఒకరోజుపాటు సమ్మె చేస్తామని చెప్పారని, కానీ ఒక్కరోజు పోర్టు ఆగితే కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని, అందుకే సమ్మె వద్దని చెప్పానని వెల్లడించారు. బాబు, పవన్ లు ఇలాగే మాట్లాడితే ఒకట్రెండు రోజులు సమ్మె చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. యాభై ఏళ్ళుగా తమ కుటుంబం బియ్యం పరిశ్రమలో ఉందని, కానీ 20 ఏళ్ళుగా ఈ వ్యాపారం మానుకున్నామని, చాలా వరకూ లీజుకు ఇచ్చామని, ప్రస్తుతం కేవలం బియ్యం ఎగుమతుల్లోనే ఉన్నామని తెలిపారు.

కాకినాడ నుంచి ఎగుమతి అవుతున్న బియ్యంలో ఏపీ నుంచి కేవలం 10 శాతం మాత్రమేనని, మిగిలిన దంతా ఛత్తీస్ గడ్, తెలంగాణా, బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వస్తుందన్నారు. ఇక్కడినుంచి ఎగుమతి చేస్తే కంపెనీల్లో తమది ఎనిమిదో స్థానంలో ఉన్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్