Saturday, November 23, 2024
HomeTrending NewsMedha Rail Coach: పటాన్ చెరువు, హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ

Medha Rail Coach: పటాన్ చెరువు, హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే పటాన్ చెరువు వరకు అటు హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు  ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రం కాకముందు ఈ జిల్లాల్లో మంత్రిగా పని చేస్తూ పటాన్‌చెరుకు వచ్చాను. ఇక్కడే సంగారెడ్డి అతిథిగృహంలో ఉంటూ పటాన్‌చెరులో గల్లీగల్లీ పాదయాత్ర చేశాను. ఇంచుమించు సమస్యలన్నీ తెలుసు. మహిపాల్‌రెడ్డి నాయకత్వంలో పటాన్‌చెరు ముందుకుదూసుకెళ్తున్నది. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఇక్కడి వరకు మెట్రోరైలు రావాలని కోరారు.

మెట్రోరైల్‌ సంగారెడ్డికి రావాలంటున్నారు. తప్పనిసరిగా రావాలి. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళితే.. మహేశ్వరానికి మెట్రో రావాలని కోరారు. అక్కడే ఆ సభలోనే నేను చెప్పాను. హైదరాబాద్‌ సిటీలో అత్యధికంగా ట్రాఫిక్‌ ఉండే కారిడర్‌ పటాన్‌చెరు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌. పటాన్‌చెరువు నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోరావాల్సి ఉంది. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మెట్రో తప్పకుండా వస్తుంది. మళ్లీ వచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశంలో పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్‌ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్ధానం చేస్తున్నాను. మహిపాల్‌రెడ్డి పారిశ్రామిక ప్రాంతానికి ప్రత్యేకంగా పాలిటెక్నిక్‌ కావాలని అడిగారు. ఇవాళనే మంజూరు చేస్తూ జీవో జారీ చేస్తాం. ఇప్పుడే కొల్లూరులో 17వేలపైచీలుకు డబుల్‌ రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశాం. పటాన్‌చెరువుకు 2వేల ఇండ్లు కేటాయిస్తున్నాం’ అన్నారు.

అంతకు ముందు రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేథా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ఈ రోజు సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారుచేసే అద్భుతమైన ప్రాజెక్టును, రూ.2500కోట్ల పెట్టుబడితో ఫేజ్‌-1ను పూర్తి చేసి, మ్యానుఫ్యాక్చరింగ్‌ పూర్తి చేసి ఈ రోజు నాతో ప్రారంభింపజేసుకున్నారు.

వరంగల్‌ ముద్దుబిడ్డలు కశ్యప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి భారీ ప్రాజెక్టును తీసుకువచ్చి వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టు చేపట్టడమే కాదు.. పూర్తి రైలును తయారు చేసేందుకు ముంబయి నుంచి మోనో రైలు తయారీకి ఆర్డర్‌ రావడం గొప్ప విషయం. భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో రైలు తయారై పోయేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెబుతున్నారు. దేశంతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి స్థాయికి ఎదుగుతున్నామని చెప్పడం అభినందనీయం. 24 గంటలు ఏ సమస్య వచ్చినా పరిష్కారించేందుకు సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం, సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్