మున్సిపాలిటీ, నగరాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని, వర్షాకాలం పూర్తి కాగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ ‘క్లాప్’ కార్యక్రమంపైనా కూడా సీఎం సమీక్షించారు. క్లాప్ కార్యక్రమంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలందించారు. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కన్‌స్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంల్లో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.
సమీక్ష సందర్భంగా సిఎం చేసిన సూచనలు:
- గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలి
- దీనివల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుంది, ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయి
- ఆ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుంది, ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదు
- అర్హులైన పేదలందరికీ కూడా 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది
- పేద కుటుంబాలు ఇంటి స్థలం కోసం మధ్యవర్తులతో పాటు, ఇతరులమీదో, ఇతర మార్గాలమీద ఆధారపడాల్సిన అవసరంలేని పరిస్థితిని తీసుకు వచ్చాము
- అలాగే ఉల్లంఘనలు, ఆక్రమిత ప్రాంతాల్లో కనీస సదుపాయాలులేని పరిస్థితి ఉండకూడదనే భారీ ఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేశాం
- దీంతో పాటు, 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాం, దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం
- అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని మనం సృష్టించాం
- ఇకపై అక్రమ ప్రాంతాల్లో, ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే వారిని నెట్టివేసే పరిస్థితులను పూర్తిగా తీసివేశాం
- పేదవాడికి ఇంటి స్థలం లేదని మన దగ్గరకు వచ్చినప్పుడు అర్హుడైతే 90 రోజుల్లోగా వెంటనే ఇంటిపట్టాను మంజూరుచేసే కార్యక్రమం చేస్తున్నాం
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.