తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్ గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది. ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది. ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అతికొద్ది సినిమాల్లో ఒకటిగా ‘తొలిప్రేమ’ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ వెండితెర మీద చూసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.
తొలిప్రేమ విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4k లో విడుదల చేస్తున్నారు. శ్రీ మాతా క్రియేషన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం జూన్ 30న 300 కి పైగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ వేడుక హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సంద్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “తొలిప్రేమ అనేది ఒక గొప్ప జ్ఞాపకం. ఇందులో భాగమైన పవన్ కళ్యాణ్ గారికి, కరుణాకరన్ గారికి, జి.వి.జి.రాజు గారికి అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం ఈ చిత్రం. నా సినీ ప్రయాణంలో తొలిప్రేమకి అంటూ ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా అప్పుడప్పుడే నా ప్రయాణం మొదలైంది. ఒకసారి రవీందర్ రెడ్డి అనే ఒక ఫైనాన్సియర్ నాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఒక కొత్త కుర్రాడితో జి.వి.జి.రాజు నిర్మాణంలో సినిమా చేయబోతున్నారని చెప్పారు. ఇదే నాకు తెలిసిన సమాచారం. నేను కొన్ని లెక్కలేసుకొని సినిమా ఓపెనింగ్ కి వెళ్ళాను. అప్పటికి నాకు చెప్పుకోడానికి కూడా ఏంలేదు. ఒక్క పెళ్లిపందిరి మాత్రమే చేశా. జి.వి.జి.రాజు గారిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకొని డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగాను. పూజ అయిపోయాక, ఒకసారి కలవమంటే వెళ్లి కలిశాను. అలా ఒక్క సిట్టింగ్ లోనే సినిమా కొనడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాతో నాకు ప్రయాణం మొదలైంది. నేను నిర్మాతగా ఎన్ని అద్భుతమైన సినిమాలు తీసినా, నా మనసులో ఎప్పటికీ తొలిప్రేమకి ప్రత్యేక స్థానముంటుంది.
సినిమా ప్రివ్యూ నుంచి వంద రోజుల ఫంక్షన్ వరకు ఎన్నో జ్ఞాపకాలు. వంద రోజుల ఫంక్షన్ రోజు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. అయినా ఫంక్షన్ కి కంట్రోల్ చేయలేనంతగా క్రౌడ్ వచ్చారు. ఒక చరిత్ర ఇది. అలాంటిది నేను మళ్ళీ చూడలేదు. ఇలా ఎన్నో చరిత్రలు సృష్టించిన సినిమా తొలిప్రేమ. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఐదేళ్లకు ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఎప్పుడు తక్కువున్నా ఈ సినిమాని రీరిలీజ్ చేసేవాణ్ణి. ఏదైనా ఫ్లాప్ వస్తే, ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం కోసం ఈ సినిమాని రీరిలీజ్ చేసేవాణ్ణి. అలా మళ్ళీ మూడుసార్లు రిలీజ్ చేశాం. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నాకు అడుగులు నేర్పించిన సినిమా తొలిప్రేమ. అలాంటి తొలిప్రేమలో నేను భాగమైనందుకు ఎప్పటికీ గర్వపడతాను. ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ ఈ సినిమా చూడాలనిపిస్తుంది. 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమా జూన్ 30న మన ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ మరోసారి థియేటర్ కి వెళ్లి ఈ సినిమా ఇచ్చే అనుభూతిని పొందండి. రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్” అన్నారు.