Thursday, March 12, 2026
Homeసినిమాభారీ ప్రాజెక్టులను సెట్ చేస్తున్న త్రిష - నయన్!

భారీ ప్రాజెక్టులను సెట్ చేస్తున్న త్రిష – నయన్!

గతంలో తెలుగులో లేడీ ఓరియెంటెడ్ కథలను చేయాలంటే ముందుగా అనుష్క పేరును పరిశీలించేవారు. అనుష్క గ్లామర్ .. ఆమెకి గల క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. పైగా పారితోషికం విషయంలో ఇంతవరకూ ఆమె ఇబ్బందిపెట్టిన దాఖలాలు కూడా కనిపించవు. అందువలన ముందుగా అనుష్క దగ్గరికే పరిగెత్తేవారు. ఇక కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అనగానే అక్కడ ముందుగా వినిపించే పేరు నయనతార. ఆమె కోసం ఎంత పారితోషికమైనా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమయ్యేవారు.

ఇక ఈ మధ్య కాలంలో అనుష్క పూర్తిగా సినిమాలు తగ్గించేసింది. ఆమె క్రేజ్ .. మార్కెట్ ఎంతమాత్రం తగ్గకపోయినా, ఆమెగా సినిమాలకి దూరంగా ఉంటోంది. చాలా గ్యాప్ తరువాత తెలుగులో ఒక సినిమా చేస్తుందంతే. ఇక కోలీవుడ్ లో చూస్తే నయనతార కూడా గతంలో మాదిరిగా కాకుండా కాస్త స్పీడ్ తగ్గించింది. దాంతో అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు త్రిష వైపు వెళుతున్నాయి. అయితే త్రిష కూడా ఇంతకుముందు మాదిరిగా ఓ మాదిరి ప్రాజెక్టులు చేయడం లేదు.

అలాంటి త్రిష చాలా గ్యాప్ తరువాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. చిరంజీవి – కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఆమె చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో బాలయ్యతో మరో సినిమా చేయడానికి నయనతార అంగీకరించింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. బాలయ్య – నయనతార కాంబినేషన్ పై మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో మరోసారి తెరపై కలిసి కనిపించనున్నారు. ఈ ఇద్దరు భామలు  సినిమాల సంఖ్యను తగ్గించినట్టుగా కనిపించినా, భారీ ప్రాజెక్టులను మాత్రమే ఒప్పుకుంటూ ఉండటం గమనించవలసిన విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular