ముఖ్యమంత్రికి తెలుగు అక్షరాలు సరిగా రావని.. జనసేన వయోజన సంచార పాఠశాల కింద ఆయనకు దీర్ఘాలు, అక్షరాలు నేర్పిస్తామని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సిఎం ముందు వారాహికి వరాహికి తేడా తెలుసుకోవాలని సూచించారు. భీమవరం జనసేన కార్యకర్తలతో పవన్ ఈ సాయంత్రం భేటీ అయ్యారు. ఎల్లుండి 30న పట్టణంలో జరిగే జనసేన వారాహి విజయ యాత్రను విజయ వంతం చేయాలని పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ జన సేన జెండా ఎగరాలని, దీనికోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ఇంకా ఎంతో మాట్లాడాలని ఉన్నా ఎల్లుండి ఎలాగూ మాట్లాడాలి కాబట్టి అప్పుడు చెబుతానని చెప్పారు. జ్వరంగా ఉన్నా ఇంతమంది కార్యకర్తలు వచ్చారని కొద్దిసేపు మాట్లాడానని, రాబోయే రెండ్రోజుల్లో వైసీపీ వారు పాడు పనులు ఇంకా చేస్తారని అన్నిటికీ అప్పుడే సమాధానం చెబుతానన్నారు. తాను ఊగిపోతూ మాట్లాడతానని సిఎం అంటున్నారని, ఇకపై ఆయన లాగే మాట్లాడతానంటూ… చేతులు ఊపుకుంటూ సైగలతో చేసి చూపించారు. అమ్మ ఒడి పథకం లో ఈ మాటలేమిటని ప్రశ్నించారు. ధైర్యం లేనివారు రాజకీయాల్లోకి రావడం సరికాదని, తానూ అన్నిటికీ తెగించే వచ్చానని స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక సీట్లో కూడా గెలవకూడదని ఆ రకంగా తమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.