Saturday, November 23, 2024
HomeTrending Newsసామాజిక సమతుల్యం జగన్ విధానం: పేర్ని

సామాజిక సమతుల్యం జగన్ విధానం: పేర్ని

పాలనలో సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ సిఎం జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రశంసించారు. గత రెండేళ్లుగా మంత్రి పదవులు, రాజ్యసభ, నామినేటెడ్ పదవులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పోరేషన్ మేయర్లు, డిప్యూటీ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల ఎంపికలో కూడా బడుగు, బలహీన వర్గాలకు అవకాశం కల్పించారని నాని వివరించారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళలో ఒక్క రాజ్య సభ సీటు కూడా బిసి వర్గాలకు ఇవ్వలేదని, రెండు కేంద్ర మంత్రి పదవులు తీసుకుంటే రెండూ అగ్రవర్ణాలకే ఇప్పించారని గుర్తు చేశారు. బిసిలు, మైనార్టీలు, ఎస్సీ. ఎస్టీలను కేవలం ఓటుబ్యాంకు గానే బాబు చూస్తారని విమర్శించారు.  అధికారంలో ఉన్నప్పుడు  పదవులకు వారిని దూరంగా ఉంచి అధికారం పోయిన తర్వాత తమ పార్టీ వారికోసమే ఉందంటూ ప్రచారం చేసుకోవడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు.  టిడిపికి ఎన్నో ఏళ్ళుగా వెన్నుదన్నుగా ఉన్న బిసిలను కూడా బాబు దారుణంగా మోసం చేశారన్నారు.

మైలవరం నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు దేవినేని ఉమా కుట్ర చేశారని, దాన్ని పోలీసులు అడ్డుకున్నారని నాని పేర్కొన్నారు. దేవినేని ఉమా ఆరోపిస్తున్న భూముల్లో మైనింగ్ కు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ భూములపై తనకు అనుమానాలు ఉన్నాయని, మైనింగ్ ఆపాలని నాటి జాయింట్ కలెక్టర్ స్టే ఇస్తే, దాన్ని నిలుపుదల చేసి అవి రెవెన్యూ భూములే అంటూ మైనింగ్ కు అనుమతిచ్చారని సాక్ష్యాలతో సహా పేర్ని నాని వివరించారు.  నాడు మంత్రిగా దేవినేని దగ్గరుండి ఈ మైనింగ్ పనులు ప్రారంభించారన్నారు. చంద్రబాబు ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయడం దుర్మార్గమని నాని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్