Mini Review: ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసిన పనిలేదు .. స్టార్ హీరోలు .. హీరోయిన్స్ ఉండవలసిన అవసరం లేదు .. షాక్ ఇచ్చే ట్విస్టులు పదే పదే తెరపై హడావిడి చేయనక్కర లేదు. మంచి కథ .. సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యే కథనం .. బయట సమస్యల్లో నుంచి బయటపడేస్తూ హాయిగా నవ్వించే సన్నివేశాలు కావాలి. ఈ మధ్య కాలంలో అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సినిమా ఏదైనా ఉందీ అంటే .. అది ‘సామజవరగమన’ అనే చెప్పాలి.
సాధారణంగా తమ వెంటపడే అబ్బాయిలతో అమ్మాయిలు రాఖీ కట్టించుకుని , అన్నయ్యా అని పిలిపించుకుంటూ ఉంటారు. కానీ ఇందులో అందుకు రివర్స్ గా హీరో కనిపిస్తాడు. ఇక హీరోయిన్ ను హీరో లవ్ చేస్తే, ‘నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి మాత్రం జరగదు’ అని అతగాడి తండ్రి తేల్చి చెప్పేస్తుంటాడు. కానీ అందుకు భిన్నంగా ఈ కథలో హీరోయిన్ ను తీసుకొచ్చి తమ ఇంట్లో ఉంచేది హీరో తండ్రినే. ఇక సినిమాల్లో హీరో .. హీరోయిన్ పెళ్లి, పీటలపైనే ఆగిపోయే సందర్భాలు ఉంటాయి. కానీ అందుకు విరుద్ధంగా ఈ సినిమాలో హీరో .. హీరోయిన్ కలిసి తాము వెళ్లిన పెళ్లిని ఆపేయాలని ప్లాన్ చేస్తారు.
ఇలా ఈ కథలో ప్రతి అంశం కొత్తగా కనిపిస్తుంది .. ఆ కొత్తదనంతో నుంచి కామెడీ పుడుతుంది .. అది థియేటర్ బయటికి వచ్చిన తరువాత కూడా తలచుకుని నవ్వేలా చేస్తుంది. అరువు తీసుకొచ్చిన కథలు .. ఆకాశం నుంచి దింపుతున్న కథలతో హడావిడి చేస్తున్న ఈ రోజుల్లో, చాలా తేలికైన సన్నివేశాలతో ఈ కథ ఆకట్టుకుంటుంది. మధ్య తరగతి నేపథ్యంలో పుట్టిన కథలను ఆడియన్స్ వెంటనే ఓన్ చేసుకుంటారు. అదే ఈ సినిమా విషయంలోను జరుగుతుంది. ‘గీత గోవిందం’ తరహాలో ఈ కంటెంట్ అందరికీ కనెక్టు అవుతుంది.