అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి.. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. రియాక్టర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు, వీరిని విశాఖలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకుంటాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఇంకా మంటలు అదుపులోకి రాలేదు, పైగా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమయంలో మొత్తం 28 మంది అక్కడ పని చేస్తుండగా 26 మంది ప్రమాదం నుంచి తప్పించుకొని బైటకు వచ్చారు.