Saturday, November 23, 2024
HomeTrending NewsGroup IV: గ్రూప్‌ 4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Group IV: గ్రూప్‌ 4 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

గ్రూప్‌ IV నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు (శనివారం) పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని తెలిపింది. పరీక్ష కేంద్రాల్లోని పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని వివరించింది. పరీక్షకు 15 నిమిషాల ముందే గేటు మూసివేస్తారని, ఆరు పద్ధతుల్లో అభ్యర్థులను తనిఖీ చేస్తారని వెల్లడించింది.

పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కమిషన్‌ పేర్కొన్నది. 8,039 గ్రూప్‌4 ఉద్యోగాలకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపింది. శుక్రవారం రాత్రి వరకు 9,01,051 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందారని వెల్లడించింది.

ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఒకరోజు ముందు వరకు 95 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొన్నది గ్రూప్‌-4కు మాత్రమే. కాగా, గ్రూప్‌-4 పరీక్షపై 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్ష ఏర్పాట్లు, నిబంధనలు, పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది విధులు తదితర అంశాలపై చర్చించారు. 2,878 లైజన్‌ ఆఫీసర్లతో కలెక్టర్లు ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్