Saturday, November 23, 2024
HomeTrending NewsEnergy Department: విద్యుదుత్పత్తిలో ‘మాచ్‌ఖండ్‌’ రికార్డు

Energy Department: విద్యుదుత్పత్తిలో ‘మాచ్‌ఖండ్‌’ రికార్డు

విద్యుత్‌ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం రికార్డు నమోదు చేసింది. 2023 జూన్‌ నెలలో 91.48 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌)తో 79.042 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసింది. ఇది గత 15 ఏళ్లలో ఒక నెలలో సాధించిన అత్యధిక ఉత్పత్తి కావడం గమనార్హం. అక్కడ మొత్తం ఆరు యూనిట్లు ఉండగా పరికరాలు దెబ్బతినడంవల్ల సుమారు రెండేళ్లపాటు పనిచేయకుండా మూలపడి ఉన్న రెండు యూనిట్లను మరమ్మతులు చేసి గత మే నెలలో అందుబాటులోకి తెచ్చారు. దీంతో మే నెల నుంచి ఆరు యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ గత నెలలో ఈ రికార్డు ఉత్పత్తి సాధించాయి.

మాచ్‌ఖండ్‌ నదిపై 98 మెగావాట్ల సామర్థ్యంతో మరో మూడు జలవిద్యుత్‌ ప్రాజెక్టులను సంయుక్తంగా నిర్మించాలని 23–10–2020న ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిని ఆచరణలో పెట్టే చర్యల్లో భాగంగా గత నెలలో భువనేశ్వర్‌లో రెండు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులు, ఒడిశాహైడ్రో పవర్‌ కార్పొరేషన్, ఏపీజెన్‌కో అధికారులు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇప్పుడు అధిక ఉత్పత్తి సాధించడం ఓ శుభ పరిణామం.

ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ మార్గదర్శకంలో ఇంధన, అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అందించిన సహాయ సహకారాలవల్లే మాచ్‌ఖండ్‌లో అత్యధిక ఉత్పత్తి సాధ్యమైందని జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ చక్రధర్‌ బాబు ప్రకటించారు. వేసవిలో అధిక విద్యుత్‌ డిమాండు ఉన్న సమయంలో అత్యధిక ఉత్పత్తికి నిరంతరం పాటుపడినందుకు జెన్‌కో ఉద్యోగులను, ముఖ్యంగా మాచ్‌ఖ్‌ండ్‌ ప్రాజెక్టు సిబ్బందిని, అధికారులను ఆయన ప్రశంసించారు. 100 శాతం పీఎల్‌ఎఫ్‌ లక్ష్యంగా పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్