Saturday, November 23, 2024
HomeTrending NewsBJP: అధిష్ఠానాన్ని ఏనాడూ ఏదీ అడగలేదు - కిషన్​ రెడ్డి

BJP: అధిష్ఠానాన్ని ఏనాడూ ఏదీ అడగలేదు – కిషన్​ రెడ్డి

తాను పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదని.. అధిష్టానం గుర్తించి ఇచ్చిన అన్ని బాధ్యతలను క్రమశిక్షణ గల కార్యకర్తగా నిర్వర్తించానని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా నియమించిన తర్వాత.. తొలిసారి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

‘‘మొదటిసారి ఎంపీగా గెలిచా. నాలుగేళ్లలో సుమారు రెండేళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేశాను. కేంద్ర మంత్రిగా ప్రధాని మోదీ నాకు బాధ్యతలు ఇచ్చారు. దీంతో మరో రెండేళ్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా చేశాను. ఎప్పుడూ పార్టీని ఏదీ అడగలేదు. మంత్రి అవుతానని.. కావాలని .. ఏదీ అడగలేదు. పార్టీయే నన్ను గుర్తించింది. ఇప్పటివరకు పార్టీ ఆదేశాలను పాటిస్తూ వచ్చాను.

1980 నుంచి ఈరోజు వరకు పార్టీ సైనికుడిగా పనిచేశా. పార్టీకి మించింది నాకు ఏదీ లేదు. పార్టీయే నా శ్వాస. పార్టీ కోసం.. పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం.. అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం. వారితో చర్చించి తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ముందుకెళ్తాం.

తెలంగాణలో భాజపా అధికారంలోకి తీసుకొచ్చే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. ఇవాళ హైదరాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశాం. జులై 8న ప్రధాని మోదీ వరంగల్‌ వస్తున్నారు. ఈ రెండు రోజులు వరంగల్‌ సభ ఏర్పాట్లపై చర్చించి.. సభను విజయవంతం చేస్తాం’’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు.

కాజీపేటలో రైల్వే పీరియాడిక్​ ఓవర్​హాలింగ్​ యూనిట్​ పెట్టాలని మొదట్లో కేంద్ర ప్రభుత్వం భావించినా.. ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద మనుసుతో కాజీపేటకు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​ మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి తెలిపారు. ఏడాదికి 2400 వ్యాగన్లను తయారు చేసే సామర్థ్యంతో 150 ఎకరాల్లో పరిశ్రమ రాబోతుందని ఆయన వెల్లడించారు. తెలంగాణకు ఇంత పెద్ద పరిశ్రమ రావడం ఇదే మొదటిసారి అన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​తో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 8న హన్మకొండ ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​లో జరిగే బహిరంగ సభ వేదిక నుంచే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​కు ప్రధాని వర్చువల్​గా శంకుస్థాపన చేస్తారని, దీంతోపాటు 6000 వేల కోట్ల విలువై జాతీయ రహదారులకు ప్రధాని భూమి పూజ చేయనున్నారని కిషన్​ రెడ్డి తెలిపారు.

రాబోయే పార్లమెంట్​ ఎన్నికలు, దక్షిణాదిలో బీజేపీ విస్తరణ తదితర అంశాలకు సంబంధించి జులై 9న హైదరాబాద్​లో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నాయకులతో కేంద్ర నాయకత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశమవనుందని కిషన్​ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్