దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు వైఎస్సార్ రైతు దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండల, రైతు భరోసా కేంద్రాల స్థాయిలో నిర్వహిస్తోంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయి రైతు దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని 2022 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 10.20 లక్షల మంది రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారంఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ.1,117.21 కోట్ల బీమా పరిహారాన్ని బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. దీంతోపాటు వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం రూ.63.96 కోట్ల వ్యయంతో నిర్మించిన 52 డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను కూడా నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా, రైతుల తరఫున పూర్తి ప్రీమియం బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని.. సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఈ-క్రాప్‌లో మన గ్రామంలో మన ఆర్బీకేల ద్వారా నమోదు చేయించి, నోటిఫైడ్ పంటలకు “డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా” ద్వారా బీమా రక్షణ కల్పిస్తూ.. ఒక సీజన్‌లో జరిగిన పంట నష్టానికి మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభంలోనే క్రమం తప్పకుండా పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేడు అందిస్తున్న రూ.1,117.21 కోట్లతో కలిపి ఈ నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం మొత్తం 54.48 లక్షల మంది రైతన్నలకు అందించిన “వైఎస్సార్ ఉచిత పంటల బీమా” పరిహారం అక్షరాలా రూ.7,802.05 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు, రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ, ధాన్యం సేకరణ, వైఎస్సార్ యంత్ర సేవా పథకం, వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు పథకం, జగనన్న పాల వెల్లువ లాంటి పథకాల ద్వారా గత నాలుగేళ్ల పాలనలో మొత్తం రూ. 1,70,769.23 కోట్లు వ్యవసాయ రంగానికి, రైతన్నల సంక్షేమం కోసం ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపజేసింది.