ప్రజల భవిష్యత్తు కోసమే తాను వైసీపీ వారితో తిట్లు తినాల్సి వస్తుందని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గడప దాటి బైటకు రాని తన భార్య, తన తల్లి కూడా తిట్లు తింటున్నారని, ప్రజల కోసమే ఇవన్నీ భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి సిఎం జగన్ అనర్హుడని, యువత ఎన్నో ఆశలతో ఆయన్ను గెలిపిస్తే దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఆయన్ను గౌరవించి జగన్ గారు అని పిలిచానని, కానీ ఈరోజు నుంచి ఏక వచనంతోనే పిలుస్తానని, ఇదే విషయాన్ని ఆ పార్టీ వారికి కూడా చెబుతున్నానని అన్నారు. జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
జగన్ ప్రభుత్వం ఒక లక్షా 18 వేల కోట్ల రూపాయల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేశారని, ఆ నిధులు ఏం చేశారో చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి అధికారం లోకి వచ్చిన జగన్ ఆ మద్యం మీద లక్షల కోట్లు ఆదాయం సంపాదిస్తున్నారని, కల్తీ మద్యం వల్ల 32 మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచారని మండిపడ్డారు.చిన్న టీ షాప్ లో కూడా డిజిటల్ పే చేస్తుంటే, మద్యం షాపుల్లో మాత్రం కేవలం క్యాష్ తీసుకుంటూ ఇప్లపటికి క్ష పాతిక వేల కోట్ల ఆదాయం సంపాదించారని, ఈ డబ్బు రేపు ఓట్లు కొనడానికి ఉపయోగిస్తారని ఆరోపించారు.
“ఒక దేశం అభివృద్ది అవుతుంటే అందులో భాగమైన మన రాష్ట్రం కూడా అభివృద్ది చెందాలి. కానీ జగన్ , ఆయన కుటుంబం, మంత్రులు అభివృద్ది అవ్వడం కాదు. ప్రజల జీవన ప్రమాణాలు , ఆదాయం పెరగనప్పుడు అభివృద్ది ఎలా అవుతుంది” అని పవన్ ప్రశ్నించారు.
ప్రజలను అడ్డగోలుగా పన్నులతో బాదే రాజుకి, దారి దోపిడీ దొంగకి తేడా లేదని తిరువాళ్వారు కవి అనేవారని…. జగన్ కి, దోపిడీదొంగకి తేడా లేదని తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేశారు. ఎండిపోయిన ఆకాశం వైపు చూసే జనం , పాడైపోయిన ఈ వ్యవస్థను బాగుచేయడానికి ఒక బలమైన నాయకుడు రావాలని, ఆ పని తాను చేస్తానని, బాగు చేస్తాను ఆంధ్రప్రదేశ్ ని అంటూ ప్రకటించారు. “నా కృషి నేను చేస్తాను ..నా నేల అనుకున్నాను..పోరాటం చేస్తాను…. నేను ఆగను…. ఇప్పుడు చెప్పండి… జగన్ అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి…జనం బాగుండాలంటే జగన్ పోవాలి….. HelloAP BYE BYE YCP” అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.