వాలంటీర్ల వ్యవస్థ తో చంద్రబాబు, పవన్ లకు చలి జ్వరం పట్టుకుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు పేద, బడుగు బలహీనవర్గాలకు సేవ చేస్తూ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని, అందుకే వారికి భయం పటుకుందన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసినవి కిరాతకమైననవని, అభం శుభం తెలియని వారిపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడం కోసం పవన్ తన నాలుకకు నరం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ జన్మభూమి కమిటీలను తెస్తామని ధైర్యం ఉంటే వారి మేనిఫెస్టోలో పెట్టాలని ఛాలెంజ్ విసిరారు. వాలంటీర్లలో లక్షా 90 వేలమంది మహిళలు కూడా ఉన్నారని, ప్రజలకు సేవ చేస్తూ, కుటుంబానికి కూడా ఆసరాగా ఉంటుందని ఇంత మంది మహిళలు పనిచేస్తుంటే ఇలా మాట్లాడడం ఏమిటని, లెక్కలు కావాలంటే వారికి మీకు వంత పాడే మీడియాను అడగొచ్చు కదా అని నాని అన్నారు.
ఒకటో తారీఖున తెల్లవారక ముందే వృద్ధులు, వితంతువుల ఇళ్ళకు వెళ్లి పెన్షన్ అందిస్తూ, వారికి ఏదైనా సహాయం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగి చేసి పెడుతున్న వాలంటీర్ల గురించి మనిసి జన్మ ఎత్తినవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా అని ప్రశ్నించారు. పవన్ కు ఏమాత్రం విచక్షణ ఉన్నా వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ పవన్ చెప్పిన దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని ఒకసారి లెక్కలు చూసుకోవాలని కోరారు. చంద్రబాబు ఇచ్చిన ప్రసంగాన్నే పవన్ చదువుతున్నారని, ఆయన ఇచ్చే తప్పుడు లెక్కలతో ప్రభుత్వంపై విషం చిమ్జుతున్నారని పేర్ని నాని నిప్పులు చెరిగారు. తన తల్లి, భార్య, పిల్లలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మాట్లాడే పవన్ వాలంటీర్లపై ఇలాంటి నీఛమైన భాష ఎలా ఉపయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పై ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం ఉపయోగం లేదని, అందుకే వాలంటీర్ల వ్యవస్థపై ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని పేర్ని ఆరోపించారు.
జగన్ పై ఏకవచనంతో మాట్లాడితే తాము కూడా ఏ వచనం తో మాట్లాడాలో దానితోనే సమాధానం చెబుతామని, వైఎస్సార్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకూ హక్కు ఉందని, వారు అట్టు పెడితే తాము అట్టున్నర పెడతామని హెచ్చరించారు.