Saturday, September 21, 2024
HomeTrending NewsBJP-AP: ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదే: పురంధేశ్వరి

BJP-AP: ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదే: పురంధేశ్వరి

పొత్తులు కేంద్ర నాయకత్వం పరిధిలోని అంశమని… నేతలు, కార్యకర్తల సమన్వయంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో వైసీపీ విఫలమైనదని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్ర స్థాయిలో పెద్దఎత్తున పోరాటం చేశామని వెల్లడించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన పురంధేశ్వరి నేడు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గన్నవరం విమానాశ్రయంలో  నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి భార్లీ ర్యాలీతో పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీతో పొత్తులోనే ఉన్నామని, ఆ పార్టీ నిన్న మా మిత్రపక్షమే… నేడు కలిసే ఉన్నాం, రేపుకూడా ఆ పార్టీ మా మిత్రపక్షమే అని వ్యాఖ్యానించారు.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బిజెపి సిద్ధాంతమని, అవినీతికి దూరంగా ఉండే పార్టీ బిజెపి అని ఆమె  అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఓట్లు, సీట్లు లేకపోయినా తొమ్మిదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేసిందన్నారు.

నాలుగేళ్ళుగా 22 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి కేటాయించిందని, ఒక్కో ఇంటికి 1.80  లక్షల చొప్పున సాయం అందించిందని,  మొత్తం 22వేల కోట్ల రూపాయలను ఇళ్ళ నిర్మాణానికి అందించిందని చెప్పారు.  65 శాతం ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికి 35 శాతంకూడా పూర్తి కాలేదనన్నారు.  విభజన బిల్లులో ఇచ్చిన హామీమేరకు జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పామని గుర్తు చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టామని, కారీ రాష్ట్ర రహదారులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని, ఇటీవలే 12 వేల కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించిందని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకపోతే కేంద్రానికి అప్పజెప్పాలని సూచించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో నిధులు ఆదా చేస్తామని చెప్పిన సిఎం జగన్…చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 40-50వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టారని, ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు ఆత్యహతలు చేసుకున్న పరిస్థితి కూడా ఉందన్నారు.

దశాలవారీ మధ్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు నాసిరకం మద్యం సరఫరా చేస్తూ జేబులు నింపుకునే పనిలో పడిందని ఆరోపించారు. ఒక పక్క ప్రజలను దోచుకుంటూ మరోపక్క తాయిలాలు ఇస్తున్నామని చెబుతున్నారని, ఇది తొడపాశం పెట్టి బుగ్గ నిమిరినట్లుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నేతలు సోము వీర్రాజు, సత్య కుమార్, సునీల్ దియోధర్, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సిఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్