ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడటం సరికాదన్నారు. “అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి” అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో సర్వీస్ కమిషన్ పరీక్షలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నామని, ఎన్ని స్కాములు జరుగుతున్నాయో ఎంతమంది అరెస్టు అవుతున్నారో రోజూ వార్తలు వస్తున్నాయని బొత్స అన్నారు. ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో పోల్చి చూడలేమన్నారు. ఎవరి విధానం, ఆలోచన, లైన్ వారిదని చెప్పారు. ఏపీ విద్యా విధానాన్ని దేశమంతా గమనిస్తోందని అన్నారు.
రాష్ట్ర ప్రజల డేటాను హైదరాబాద్ లో ఉంచాల్సిన అవసరం తమకు లేదని, ఇది ప్రభుత్వం దగ్గరే భద్రంగా ఉంటుందని బొత్స స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, ఆయన పార్ట్ నర చంద్రబాబు మాత్రమె హైదరాబాద్ లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ గాలి మాటలు మాట్లాడుతునాంతూ ఆగ్రహం వ్యక్తం శేశారు.
వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దుగ్ధతోనే విమర్శలు చేస్తున్నారని, అసలు వారి విధి విధానాలు ఏమిటో పవన్ కు తెలుసా అంటూ ప్రశ్నించారు. ప్రతి 50 ఇళ్ళకు ఒకరు చొప్పున స్థానికంగా నివసించేవారు వాలంటీర్లుగా పనిచేస్తున్నారని, అలాంటి వారిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం సబబుకాదన్నారు. ఆయనకు ఏ నిఘా వర్గం చెప్పిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు, సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారి సమస్యలు పరిష్కరిస్తున్న వ్యవస్థను ఆయన కించపరిచారని బొత్స మండిపడ్డారు.