పవన్ కళ్యాణ్ హద్దులు మీరి మాట్లాడుతున్నారని, ఆయనది చిత్ర- విచిత్ర స్వభావమని, ఎప్పుడు ఊగిపోతాడో… ఎప్పుడు సాగిపోతాడో తెలియదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జగన్ ను ఏకవచనంతో పిలుస్తానని చెబుతున్నాడని, అది ఆయన సంస్కారానికి సంబంధించిన అంశమని అన్నారు. పవన్ అంటే గాలి అని, కళ్యాణ్ అని ఆయన తండ్రి పెట్టిన పేరని, ఈ పేరు పెట్టినందుకు సార్ధక నామధేయుడని అనిపించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఉభయ గోదావరి జిల్లాలో కాపులు పెద్ద సంఖ్యలో ఉంటారని, వారిని మచ్చిక చేసుకొని, రెచ్చగొట్టడానికే … దుష్ట చతుష్టయం ఆలోచన మేరకే పవన్ ఆ జిల్లాల్లో తిరుగుతున్నాడని ఆరోపించారు. ఎన్నికల నాటికి వారిని టిడిపికి ఓట్లు వేయించడమే పవన్ ప్రయత్నమన్నారు. వాలంటీర్లపై పవన్ దారుణమైన వ్యాఖ్యలు చేశారని, మహిళా వాలంటీర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయగానే తాను అందరినీ అనలేదని వివరణ ఇచ్చాడని విమర్శించారు. వాలంటీర్లు జగన్ సైన్యంలా పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను లబ్దిదారులకు అందిస్తూ మంచి పేరు తెచ్చారని, వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదనే భయంతోనే ఈ విమర్శలు చేస్తున్నారని రాంబాబు మండిపడ్డారు. పిచ్చి జనాన్ని ముందు పెట్టుకొని పిచ్చి కూతలు కూసే పవన్ కు రాజకీయ భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. మల్టిపుల్ డిజార్డర్ తో ఆయన బాధ పడుతున్నారని అన్నారు. అతనితో రాజకీయంగా గానీ, సినిమాల్లో గానీ ఎవరూ కలిసి నడవలేరని అన్నారు. స్వయంగా తానే ఓడిపోతే రాపాక గెలిచాడన్న దుగ్ధతోనే ఆయన్ను చిన్న చూపు చూస్తే ఇప్పుడు మాతో కలిసి నడుస్తున్నారని చెప్పారు. పివి రావు. జెడి లక్ష్మీ నారాయణ, రామ్మోహన్ రావు, తోట చంద్ర శేఖర్, రాజు రవితేజ, మారిశెట్టి రాఘవయ్య లాంటి వారు కూడా ఆయన్ను భరించలేక వచ్చేశారని వివరించారు. వారాహి అమ్మవారిని ఎవరినా వాహనంగా పెట్టుకుంటారా, ఈ వాహనంపై ఎక్కి బూతులు తిడతారా అని ప్రశ్నించారు.
ప్రజా రాజ్యం సమయంలో కూడా వైఎస్ పై పంచెలూడదీస్తానని పవన్ వ్యాఖ్యలు చేస్తే దానివల్ల చిరంజీవికి మరో నాలుగు సీట్లు తగ్గాయని రాంబాబు అన్నారు. గతంలో ఎందరో పార్టీలు పెట్టి మధ్యలోనే వెళ్లిపోయారని, కానీ జగన్ పార్టీ పెట్టి ప్రతిపక్షంలో ఉండి, 23 మంది ఎమ్మెల్యేలను టిడిపి లాక్కున్నా బెదరలేదని అలాంటి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.