సినిమాలకి సంబంధించినంత వరకూ కొన్ని కథలు జీవితాలకు దగ్గరగా అనిపిస్తాయి. మరికొన్ని కథలు జీవితాల్లో నుంచి పుట్టుకొస్తాయి. అలా యథార్థ సంఘటన ఆధారంగా ‘హత్య’ రూపొందినట్టుగా చెబుతున్నారు. విజయ్ ఆంటోని హీరోగా ఈ సినిమా నిర్మితమైంది. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. టైటిల్ తోనే కాదు .. విజయ్ ఆంటోని లుక్ పరంగా కూడా ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచింది.
చాలా కాలం క్రితం జరిగిన ఒక హత్యను .. దాని విచారణ జరిగిన తీరును ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ ను చూస్తే, ఒక మోడల్ హత్య కేసులోని మిస్టరీని ఛేదించడానికి హీరో రంగంలోకి దిగినట్టుగా అర్థమవుతోంది. ఆ యువతి తాళం వేయబడిన తన బంగ్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతుంది. ఎలాంటి ఆధారాలు కనిపించవు .. పోలీసులకు ఎలాంటి క్లూ దొరకదు. అప్పుడు హీరోకి ఈ కేసును అప్పగించడం జరుగుతుంది.
నిజానికి గతంలో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ ఇది వాస్తవంగా జరిగిన సంఘటన కారణంగా .. ఈ కథలోని ఒక ట్విస్ట్ కారణంగా .. విజయ్ ఆంటోనీ మార్క్ యాక్షన్ కారణంగా కొత్తగా అనిపిస్తుందని అంటున్నారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితిక సింగ్ – మీనాక్షి చౌదరి .. రాధిక ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘బిచ్చగాడు 2’తో హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ, ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.