ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు దంచికొట్టిన వానలు.. నాలుగో రోజు కాస్త తెరిపి ఇచ్చాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్, మహబూబ్‌నగర్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. మెదక్, మహబూబాబాద్, నారాయణపేట, వికారాబాద్, వరంగల్‌లో చాలాచోట్ల, ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి కొన్నిచోట్ల, బీ కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి.
హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. నగరంలో 16 ఈఆర్డీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. నీరు నిలిచిన ప్రాంతాలను తొలగించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తెలంగాణ ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి.