Monday, September 23, 2024
HomeTrending NewsCM Jagan: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన

CM Jagan: నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన

పేద విద్యార్దుల విదేశీ విద్య కోసం సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద ఆర్ధిక సాయాన్ని కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించనున్నారు.  అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి విద్యార్ధుల ఖాతాలకు  జమ చేయనున్నారు.

పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్ధులకు రూ. 1 కోటి వరకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తోందని,  గడచిన 6 నెలల్లో జగనన్న విదేశీ విద్యా దీవెన కింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు సాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ / టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం మొదలైన 21 ఫ్యాకల్టీలకు సంబంధించి టాప్-50 ర్యాంక్లు సాధించిన కళాశాలల్లో ప్రవేశం పొందిన ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్..  విమాన ప్రయాణం, వీసా ఖర్చులతో సహా.. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువు కునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది.

కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి అర్హతను రూ. 8 లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కల్పిస్తోంది.  మరిన్ని వివరాల కోసం https://jnanabhumi.ap.gov.in ను సందర్శించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై  ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం (1902 టోల్ ఫ్రీ నంబర్) ను సంప్రదించవచ్చని సూచించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్