పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి ఆపుతున్నారని కేసీఆర్ తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో నీళ్ల కోసం పంచాయతీ ఉందని కేసీఆర్ తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల కూడా కాళేశ్వరంతో పాటే పూర్తయ్యేది. కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నాయకులు స్టేలతో ఆపుతున్నారు. భగవంతుడి దయ వల్ల పాలమూరు ప్రాజెక్టు 85 శాతం పూర్తయింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తాండూరు, పరిగి, వికారాబాద్ చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. హామీ ఇస్తున్నాను.. 100 శాతం ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువస్తాను అని కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా నదిలో నీళ్ల కోసం పంచాయతీ ఉందని కేసీఆర్ అన్నారు. గోదావరిలో నీళ్ల పంచాయతీ లేదు. గండిపేట, హిమాయత్ సాగర్ వరకు గోదావరి లింక్ అయిపోతుంది. అక్కడ్నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక పద్ధతిలో ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చి ఇస్తాను. చింత చేయాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ ఉద్ఘాటించారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో భయంకరమైన పరిస్థితి ఉండే అని కేసీఆర్ గుర్తు చేశారు. నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం. తద్వారా చెట్లను పెంచాలని నిర్ణయించాం. వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె అని నేనే పాట రాశాను. పచ్చదనం ఉంటేనే వర్షాలు వస్తాయి. చెట్లు నాటడం ఏందని చాలా మంది నవ్వారు. కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనం పెరిగింది. నాశమైన అడవులను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అడవులను పెంపొందించేందుకు హరిత సైనికుల్లాగా ప్రియాంక వర్గీస్, భూపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారు. రిజర్వ్ ఫారెస్టును బ్రహ్మాండంగా పెంచుకున్నాం. గ్రామాల్లో నర్సరీలను పెంచుకోవాలి. హరితహారం కార్యక్రమాన్ని వదిలిపెట్టొద్దు అని సర్పంచ్‌లను కోరుతున్నాను. బతకడానికి వీలైన పర్యావరణ పరిస్థితులు కల్పించాలి. హరితహారంలో అనేక అద్భుతాలు జరిగాయన్నారు కేసీఆర్. తెలంగాణలో.. ప్రతి గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ పార్కులు కూడా రూపుదిద్దుకున్నాయి. ఈ విజయం మనందరి విజయం. ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను పంచేందుకు ఒక వంద కోట్ల బడ్జెట్ అయినా పెట్టి పంచాలని నిర్ణయించాం అని కేసీఆర్ తెలిపారు.