Sunday, January 19, 2025
HomeTrending Newsఒక హుజురాబాద్ ఎన్నో సమాధానాలు

ఒక హుజురాబాద్ ఎన్నో సమాధానాలు

మాట.. పదునైన కత్తిలాంటిది. దాన్ని సానుకూలమైన ధోరణిలో వాడితే.. కత్తి లాంటి అవకాశాలూ కల్పిస్తుంది. నాలుక ఉంది కదా అని.. అహంకారం తలకెక్కి వాడేస్తే.. ఆతర్వాత కర్చుకునే నాలుక పాలిట కత్తై వేలాడుతుంది. మాటలతో మాయలు చేస్తున్నారనుకునేవారే.. ఇప్పుడా మాటను కన్నూమిన్నూ కానక తూలితే ఏం జరుగుతుందో.. హుజురాబాద్ ఉపఎన్నిక స్పష్టం చేసింది.

కనకపు సింహాసమున శునకం కూర్చుండబెట్టి దొనరగ పట్టము గట్టిన.. అని సుమతీ శతకాన బద్దెనేనాడో చెప్పుకొచ్చాడు. మరలాంటి శునకాన్నే ఉదాహరణగా తీసుకుని.. కుక్కను నిలబెట్టినా గెలుస్తాడంటే..? ఆ ఒక్క మాట ఎన్ని పెడర్థాలకు ఆస్కారమో.. మాటల మాంత్రికులైన పెద్దలకేం తెలియనిదీ కాదు. కానీ సదరు సవాల్ విసిరిన నేతపైనున్న ఫ్రస్ట్రేషన్ నుంచి మీడియా అడిగే ప్రశ్నల మీదుగా కాస్త స్థిమితత్వం లోపించి పూనుకున్న ఆవేశం తాలూకు అసందర్భోచిత వ్యాఖ్యానమది. ఇప్పుడది పత్రికల సాక్షిగా పర్చుకుని రికార్డైన చరిత్ర. .

అలాంటి మాటే.. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పుడు ఏకంగా యాక్టింగ్ ప్రెసిడెంట్ గా మరింత ప్రమోషనందుకుని.. దేశవిదేశాల్లో తనదైన శైలిలో ఓవైపు ఆకట్టుకునే ప్రతిభావంతుడనిపించుకున్న విజ్ఞుడైన మన కేటీఆర్ మాటల్లో వ్యక్తమైతే…? ” కేసీఆర్ కుక్కను నిలబెట్టినా గెలుస్తది”.. అనే హుజురాబాద్ బైపోల్స్ ఎన్నికలకు ముందు క్యాండిడేట్ ఎవరా అన్న తర్జనభర్జన సమయంలో తూలిన మాట ఇది!

వాస్తవానికి ఈమాట మామూలు అహంకారపు మాటేంకాదు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా.. మంత్రులు మందిమార్బలం, అంగబలం, ఆర్థికబలం, అధికారబలం అన్నింటితో ముప్పేట సెంటర్ చేసి పద్మవ్యూహంతో అభిమన్యుణ్ని చేద్దామనుకున్నా.. అర్జునిడిలా విజయుడై నిల్చిన ఈటెల ముందు ఓటమి తప్పని ఎన్నికను తాము ఎంత లైట్ తీస్కున్నామో చెప్పేందుకు తూలిన మాట! మాకే సవాలా…? మా అధికార దర్పం ముందు నువ్వెంత.. మేం కుక్క ను నిలబెట్టినా గెలుస్తామనే తలపొగరును పట్టిచూపే అతిధీమాతో కూడిన అహంభావపు మాట! ఇక మేము తప్ప ఎవరున్నారు గనుక.. అనే భావనకు ఆస్కారం కల్పించే మాట! ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపోటములు సహజమే అయినా.. తమకెదురు నిల్చేవాళ్లంతా కుక్కలతో సరిసమానమని పుల్లలా తీసేసే మాట! ఇక తాము నిలబెట్టబోయే వ్యక్తి.. ఓ కుక్కతో సరిసమానమనే మాట! ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతికూల పద్ధతిలో తూలిన మాటిచ్చే భావర్థాలెన్నో!!

మరి తమ మాటల గారడీతోనే తెలంగాణా ప్రజానీకాన్ని సమ్మోహనపర్చినవాళ్లు.. ఇవాళ అలాంటి మాటలనే తూలుతూ అహంకారపు ఎత్తుల్ని షోఆఫ్ చేస్తుంటే.. ఏ మాటలకైతే సమ్మోహనమైన జనముందో.. అదే జనంలో ఇదేంటనే చర్చకు తెరతీసిన స్వయంకృతానికి పరాకాష్ఠ కాదా హుజూరాబాద్ ఫలితం…?

అంతేకాదు మాట వచ్చు కదా అని ఏది పడితే అది మాటలాడితే… రాబోయే రోజుల్లో హామీల రూపంలో నోటినుంచి జారిన ఆ మాటల అమలు సంగతి కూడా కాసింత దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీడియా, ప్రతిపక్షాలే కాదు.. సోషల్ మీడియా రూపంలో సాధారణ జనమూ వాచ్ డాగై ఇట్టే పట్టుకుంటున్న రోజులివి. అందుకే మాట పైలం.. జరభద్రం!

మాట తప్పితే.. మాట తూలితే.. మాటలు కోటలు దాటితే.. మాటలే కదా మాట్లాడేస్తే పోలా అని నిర్లిప్తత వహిస్తే… 20 ఏళ్ల క్రితం పార్టీని ప్రకటించిన గ్రౌండ్ లోనే… అదే పార్టీనించెదిగిన ఓ ఉద్యమ సహచరుడు తొడగొట్టి చేసిన సవాల్ రూపానికి ప్రతిరూపమైన హుజూరాబాద్ వంటి తీర్పును అదే మైదానం సాక్షిగా వినాల్సి వస్తుంది. పురోగమననానికి ఆలంబనైన మాటే.. నేడు అదే వేదికగా తిరోగమననానికీ వేదికైన చరిత్రను కళ్ల ముందుంచుతుంది.

చివరాఖరుగా.. మనిషంటే ఏది పడితే అది మాట్లాడగలడు కదా అని.. “విశ్వాసానికి మారుపేరైన కుక్కను గెలి చేసే అర్హత ఇప్పుడు మనిషికుందా అనేది మరో ప్రశ్న…? ఇకది పిచ్చికుక్కైతే అంటారా…? పిచ్చి పట్టిన ఆవేశంలో కరుస్తూనే ఉంటుంది మన రాజకీయ నాయకుల్లా!

-రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్